Saanvi in World Book of Records : సాఫ్ట్‌వేర్ కుటుంబం.! ట్రెండీ జీవితం.! తీరిక లేని సమయం.! మరి, వారి పిల్లలు ఎలా పెరుగుతారనే ఆలోచనొస్తే ఇంకేముంది అమ్మానాన్నలకు దూరంగా పాశ్చాత్య సంస్కృతికి దగ్గరగా ఉంటారని అనుకుంటారు ఎవరైనా. కానీ ఈ అమ్మాయి అందుకు భిన్నం. రెండున్నర ఏళ్లకే పుస్తకాలు చదవడం అభిరుచిగా మలచుకుంది. క్రమంగా ఇతిహాసాలను దినచర్యలో భాగం చేసుకుంది. ఫలితంగా 5 నిమిషాల్లో భగవద్గీతలోని 58 శ్లోకాలు పఠించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్ట్స్ సహా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది. మరి, తనెవరో చూసేద్దామా.
విన్నారుగా భగవద్గీతలోని శ్లోకాన్ని ఎంత చక్కగా పఠిస్తుందో. బాల్యం నుంచే పుస్తక చదవడం అంటే మహా ఇష్టం. తొలుత బొమ్మలు, కథల పుస్తకాలు చదువుతూ క్రమంగా పురణాలు, ఇతిహాసాలపై దృష్టి సారించింది. కట్ చేస్తే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ TEDx స్పీకర్ సహా మరెన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకుందీ అమ్మాయి.
ఈ అమ్మాయి పేరు సాన్వీ జమాల్‌పూర్. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌కు చెందిన సునిత, ప్రదీప్ దంపతుల కుమార్తె. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేశారు. ఆ సమయంలో కుమార్తెను డేకేర్ సెంటర్‌లో ఉంచి ఉద్యోగానికి వెళ్లేవారు. ఈ సమయంలో బొమ్మలతో కూడిన పుస్తకాలను చూడటం అలవాటు చేసుకుంది సాన్వీ.
నవలలు, ఇతీహాసాలు చదవడం : ఉద్యోగరీత్యా సాన్వీ తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అయితే కొవిడ్ సమయంలో ఎవ్వరూ బయటికి వెళ్లలేని పరిస్థితి. దీంతో కుమార్తె అభిరుచులను గుర్తించడం మొదలు పెట్టారు. చిత్రాలు వేయడం, కథలు పుస్తకాలు చదవడం చూసి ఆ దిశగా ప్రోత్సహించారు. అలా టీవీలో రామాయణం, మహాభారతం సీరియల్స్ వీక్షించి ప్రేరణ పొందిందీ అమ్మాయి. మెల్లగా నవలలు, ఇతిహాసాలు, పంచతంత్ర వంటి పుస్తకాలు చదవడం దినచర్యలో భాగం చేసుకుంది.
బాల్యం నుంచి భగవద్గీతలోని శ్లోకాలపై పట్టుసాధంచిందీ సాన్వీ. ప్రాచీన భగవద్గీతలోని క్లిష్టతరంగా ఉండే 700 శ్లోకాలను కంఠస్థం చేసి గీతా జ్ఞాన జ్యోతి బిరుదు పొందింది. దాంతో పాటు 5 నిమిషాల్లో భగవద్గీతలోని 58 శ్లోకాలు, 2 నిమిషాల 15 సెకన్లలో నారాయణ ఉపనిషత్తు పఠించి 11 ఏళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ : వీటితో పాటు భగవద్గీతలోని 18 అధ్యయనాలు వేగంగా పూర్తి చేసినందుకు గాను 2021లో మైసూర్ దత్తపీఠం నుంచి గోల్డ్ మెడల్ అందుకుంది సాన్వీ. 2023లో నైతిక బలం, ఆరోగ్యంపై ప్రసంగించి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. దాంతోపాటు పద్యాలు, శ్లోకాలు చదవడం, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పోడ్‌కాస్ట్ ఓరేటర్ అవార్డు, TEDx స్పీకర్, చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నట్లు చెబుతోంది సాన్వీ.
ప్రస్తుతం పదో తరగతి చదువుతూనే వైద్య నిపుణురాలు వీఎస్ రాజమ్మ శిష్యరికంలో అమెరికా నుంచి వర్చ్యువల్‌గా ఉపనిషత్తులపై కోచింగ్ తీసుకుంటోందీ అమ్మాయి. పుస్తక పఠనం అభిరుచిగా మలచుకుని దాదాపు 100కు పైగా పుస్తకాలు చదివిందీ అమ్మాయి. చిన్నవయసులోనే భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా పఠించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కొండా సురేఖ సహా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
బహు భాషా కోవిదురాలు : శ్లోకాలను అభ్యసించడమే కాదు వివిధ భాషలు నేర్చుకోవడంలో ముందుంది సాన్వీ. తెలుగు, ఇంగ్లీషు, హిందీ సంస్కృతం సహా 12 భాషాల్లో ప్రావీణ్యం సంపాదించి బహు భాషా కోవిదురాలు అనిపించుకుంది. అంతేకాదు, భగవద్గీతలోని కొన్ని అంశాల ఆధారంగా చేసుకుని మానవ జీవనశైలికి అనుసంధానం చేస్తూ ఓ పుస్తకాన్ని రచించింది. ఇందుకోసం దాదాపు 8 నెలలు కష్టపడినట్లు చెబుతోంది.
చిన్న వయసులోనే ఇతీహాసాలను కంఠస్థం చేస్తూ ఆధ్యాత్మికవేత్తల ప్రశంసలు అందుకుంటోందీ ప్రతిభావంతురాలు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించడంతో పాటు ఇతీహాసాలను ప్రాముఖ్యాన్ని పది మందికి చేరవేయడానికి కృషి చేస్తానని అంటోంది.
YUVA : మిల్లెట్స్‌తో ఐస్ క్రీమ్ - ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇక వదిలిపెట్టరు!
YUVA : ఇన్నోవేషన్, సొల్యూషన్స్ - ఈ రెండింటి కలయికే మహాత్మాగాంధీ వర్సిటీ టెక్నోవేషన్