దాహం తీరాలంటే రోజూ ఎండలో 2కి.మీ నడవాల్సిందే!
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని బోర్దాపాడా గ్రామానికి చెందిన గిరిజనులు గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రతిరోజు సుమారు 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు. దట్టమైన అడవుల్లో పెద్ద బండరాళ్ల మధ్య నుంచి ఇలా నిత్యం నీటి కోసం వీరు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇందుకోసం తల్లులతో కలిసి కూతుళ్లు.. అత్తలతో కలిసి కోడళ్లు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస నీటి అవసరాలను తీర్చుకునేందుకు ప్రతి రోజు మండుటెండలను సైతం లెక్కచేయకుండా నీటి కోసం యుద్ధం చేస్తున్నారు. ఇందుకోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు.
ప్లాస్టిక్ డబ్బాలను బావిలోకి వదిలి వాటి ద్వారా బిందెల్లో నీటిని నింపుకుంటున్నారు. అలా అని ఆ నీరు సైతం సురక్షితమైనవా అంటే కాదనే చెప్పాలి. వాటిని శుద్ధి చేసేందుకు నీళ్లు వడకట్టే జాలితో పోసుకుంటూ.. వాటినే తాగుతున్నారు. అయితే గ్రామంలో ఉన్న నీటి బావులు ఇప్పటికే ఎండిపోయాయని.. ప్రస్తుతం తోడుకుంటున్న బావిలోని నీళ్లు కూడా 15 రోజుల్లో అయిపోతాయని గ్రామస్థులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తమ గ్రామ ప్రజల నీటి కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు ఇక్కడి వారు.
కేవలం మహారాష్ట్రలోనే కాదు.. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో కూడా గతంలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. బిందెడు నీటి కోసం.. తమ ప్రాణాలు ఫణంగా పెట్టేవారు. గూసియా గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ.. అందులో నీరు లేదు. ఉన్న 3 బావులే వారికి ఆధారం. ఆ మూడుబావులు ఎండిపోయే పరిస్థితికి రాగా.. ఉన్న కొద్దిపాటి నీటికోసమే రోజూ ప్రాణాలకు తెగించి సాహసాలు చేసేవారు. ఈ పూర్తి కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.