బిడ్డ ప్రాణం కోసం 10కి.మీ నడక.. మృతదేహంతో అలానే ఇంటికి.. కలెక్టర్ స్పందన - వేలూరు జిల్లా తమిళనాడు న్యూస్
🎬 Watch Now: Feature Video
Vellore snake bite : తమిళనాడు వేలూరు జిల్లాలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ పీ కుమారవేల్ పాండియన్ పరామర్శించారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ గ్రామాన్ని సోమవారం సందర్శించారు. చికిత్స కోసం చిన్నారిని కుటుంబ సభ్యులు 10 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లడం జిల్లాలో సంచలనం సృష్టించింది. దీనిపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు.
ఏం జరిగిందంటే?
వేలూర్ జిల్లాలోని అల్లేరీ గ్రామంలో విజి, ప్రియ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి థనుష్క (18 నెలలు) అనే కుమార్తె ఉంది. మే 26న రాత్రి ఇంటి బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఓ పాము కాటేసింది. పాప ఏడుపు విని నిద్రలేచిన విజి, ప్రియ.. చిన్నారిని వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల.. ఆస్పత్రికి చేరుకోవడం ఆలస్యమైంది. అప్పటికే పాము విషం ఒళ్లంతా పాకి చిన్నారి మరణించిందని వైద్యులు ప్రకటించారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపించారు. అనంతరం, శవాన్ని.. తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి మృతదేహంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అంబులెన్సు మొరాయించింది. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల.. వాహనం ముందుకు కదిలే పరిస్థితి లేదు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్లారు. కాలి నడకన 10 కిలోమీటర్లు ప్రయాణించారు.
గ్రామంలో హెల్త్ నర్సులు లేకపోవడం వల్ల.. చిన్నారిని నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. తమ ఊరికి సరైన రోడ్డు మార్గమే లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై.. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా.. రోడ్లు వేయడం లేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సోమవారం.. బాలిక కుటుంబ సభ్యులను కలిశారు జిల్లా కలెక్టర్ కుమారవేల్ పాండియన్. బాలిక మృతికి సంతాపం వ్యక్తం చేశారు. గ్రామంలో హెల్త్ నర్సులను నియమించామని చెప్పారు. వారి కాంటాక్ట్ నంబర్లను గ్రామస్థులకు అందించామని తెలిపారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం స్పందించారని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రెటరీని ఆదేశించారని చెప్పారు.
అల్లేరీలో రోడ్ల నిర్మాణానికి రూ.5కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ట్రాఫిక్ ఫ్రెండ్లీ మార్గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అల్లేరీకి తారురోడ్డు నిర్మాణం విషయమై ఇప్పటికే అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఇప్పటివరకు.. వివిధ కొండ ప్రాంతాలకు ఉన్న మార్గాలను మెరుగుపరుస్తూ వచ్చారు.