'విఘ్నాలు లేకుండా చూడు స్వామి'... ఏటీఎం చోరీకి వచ్చి దేవుడికి ప్రార్థనలు - బెంగళూరు ఏటీఎం రాబరీ
🎬 Watch Now: Feature Video
ఏదైనా మంచి పని చేసే ముందు చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటుంటారు. కానీ, ఏటీఎం చోరీకి వచ్చిన ఓ దొంగ.. దేవుడికి ప్రార్థనలు చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చోరీ పూర్తైపోవాలంటూ అతడు ప్రార్థించడం సీసీటీవీలో రికార్డైంది. కర్ణాటక బెంగళూరులోని కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఏటీఎం వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడిని తుమకూరుకు చెందిన కరిచితప్పగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
రంగనాథపురలోని ఓ బార్లో సప్లయర్‌గా పనిచేసే కరిచితప్ప.. డబ్బుల కోసం అప్పుడప్పుడు దొంగతనాలు చేసేవాడు. పగటి పూట ఏటీఎంలను తనిఖీ చేసుకునేవాడు. సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను గుర్తుపెట్టుకొని రాత్రి వేళల్లో దొంగతనాలు చేసేవాడు. ఇలాగే జనవరి 14న కరిచితప్ప మద్యం సేవించి కామాక్షిపాలాలోని కావేరీపుర్ జయలక్ష్మి కాంప్లెక్స్‌లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్లాడు. దొంగతనం చేసే ముందు సీసీటీవీని చూస్తూ ప్రార్థనలు చేశాడు. అనంతరం ఏటీఎంను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు. బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.