CID Chief Sanjay Comments on Chandrababu Case: 'ప్రైవేటు వ్యక్తికి పదవులు..' చంద్రబాబు కేసుపై సీఐడీ చీఫ్ ఏమన్నారంటే..! - AP CID
🎬 Watch Now: Feature Video
Published : Sep 13, 2023, 7:58 PM IST
|Updated : Sep 13, 2023, 8:19 PM IST
CID Chief Sanjay Comments on Chandrababu Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయని సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు. సాధారణంగా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు.. అటు నుంచి వ్యక్తులకు వెళ్లాయన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పూర్తి సంబంధం ఉంది కాబట్టే... అరెస్టు చేశామని వెల్లడించారు. ఒక ప్రైవేటు వ్యక్తికే చాలా పదవులు ఇవ్వడం, కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. టీడీపీకి చెందిన జె. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని సీఏగా నియమించారని తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు (Chandrababu Signature) ఉన్నాయని తెలిపారు. బడ్జెట్ అనుమతితో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (Center of Excellence) కేంద్రాల ఏర్పాటు, కేబినెట్లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాలపై చంద్రబాబు సంతకాలు చేశారన్నారు.
జీవోలో 90 - 10 శాతం వాటాలను పేర్కొన్నారని, కానీ ఒప్పందంలో లేదని పేర్కొన్నారు. ఇది దురుద్దేశంతో కూడుకున్న నిర్ణయమేనని తెలిపారు. సీమెన్స్ కంపెనీ ఇండియా ఎండీ కూడా 164 స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. రూ. 58 కోట్లు మాత్రమే తమకు వచ్చాయని సీమెన్స్ సంస్థ పేర్కొందన్నారు. 241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లిపోయాయని తెలిపారు. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటుకు ఖర్చు చేశారు. ఇక్కడ నేరంలో ఇమిడి ఉన్న డబ్బు రూ.241 కోట్లు అని వెల్లడించారు. డిజైన్ టెక్ (Design Tech) ద్వారా డబ్బులు వెళ్లిపోయాయి... రూ. 58 కోట్లతో కొనుగోలు చేసి రూ. 2800 కోట్లుగా చూపించారన్నారు. గుజరాత్లో 85-15 శాతం మోడల్లో ఒప్పందాలు జరిగాయన్నారు. గుజరాత్లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఏపీలో రూ. 2800 కోట్ల సాప్ట్వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోందని తెలిపారు. ఈడీ, సీఐడీ సుమన్ బోస్, వికాస్ కన్వెల్కర్ను అరెస్టు చేసిందని, ప్రస్తుతం వారు బెయిల్పై ఉన్నారని తెలిపారు. డిజైన్ టెక్కు చెందిన రూ.32 కోట్లు ఈడీ సీజ్ చేసిందని తెలిపారు. కొన్ని జీవోలు, నోట్ ఫైల్స్ కూడా ఉద్దేశపూర్వకంగా మాయమయ్యాయని సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్ పేర్కొన్నారు.