CM Revanth on Yadagirigutta Temple Board : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముసాయిదాలో పలు మార్పులు : తిరుమలలో మాదిరే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల విషయంలో ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులను సూచించారు.
పాల్గొన్న అధికారులు : ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు (మౌలిక వసతులు), ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, సీఎ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఒకే ట్రిప్‌లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ!
యాదాద్రి పేరు మారుతోంది - టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డ్ - సమీక్షలో సీఎం ఆదేశాలు