ఆన్లైన్ వినియోగదారులు పాస్వర్డ్లు వినియోగించడం సర్వసాధారణం. బలమైన పాస్వర్డులు ఉంటేనే వ్యక్తిగత సమాచారానికి భద్రత ఎక్కువ. అయితే 83 శాతం మంది తమవి బలహీనమైన పాస్వర్డ్లు అని భావిస్తున్నారు. తమ వివరాలు లీక్ అయ్యాయా? లేదా? అనే విషయం ఎలా తెలుసుకోవాలనే విషయంపై 54 శాతం మందికి అవగాహన లేదని గుర్తించారు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు.
ఈ-మెయిల్, సామాజిక మాధ్యమాలు సహా అనేక ఆన్లైన్ సేవలకు పాస్‌వర్డ్‌ల వినియోగం తప్పనిసరి. అవి ఎంత క్లిష్టంగా ఉంటే అంత సురక్షితం. ప్రస్తుతం ప్రతి యాప్‌లో పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవ్వలేని పరిస్థితి. క్లిష్టమైన వాటిని గుర్తుంచుకోవడం యూజర్లకు కష్టంగా మారింది. అంతేకాక వీటిని తరచూ మార్చుకోవాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌లను రహస్యంగా భద్రపరుచుకోవడం కూడా సవాలే. కొంత మంది యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను వ్యక్తిగత కంప్యూటర్లలో ఫైల్ క్రియేట్ చేసుకుని భద్రపరుచుకుంటున్నారు.
55 శాతం మంది ఆన్లైన్ వినియోగదారులు తాము ఉపయోగించే అన్ని పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకుంటున్నట్లు చెప్పారని కాస్పర్‌స్కై నివేదికలో తెలిపింది. ప్రతి ఐదుగురిలో ఒకరు(19 శాతం) పాస్‌వర్డ్‌లను తమ కంప్యూటర్లలో భద్రపరచుకుంటున్నారని, 18 శాతం మంది బ్రౌజర్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లలో సేవ్ చేసుకుంటున్నారని పేర్కొంది.
ఆన్లైన్ వినియోగదారులు బలమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కాస్పర్‌స్కై నివేదిక స్పష్టం చేస్తోంది. ‘Have I Been Pwned?' వంటి ఆన్లైన్ సేవల ద్వారా తమ వివరాలు లీక్ అయ్యాయో లేదో తెలుసుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తోంది. అకౌంట్ లాగిన్ వివరాలు ఎవరితో పంచుకోవద్దని, ఇతరులు ఉపయోగించే కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలో మీ వివరాలు సేవ్ చేసుకోవద్దని సలహా ఇస్తోంది.