Harish Rao on Donation for Flood Victims : ఖమ్మం వరద బాధితులకు సాయం అందించేలా కేసీఆర్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన, బీఆర్ఎస్ ప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని ఆయన ఆదేశించారని తెలిపారు. నిత్యావసర సరుకులను గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మంలో వరదలు వచ్చాయని వివరించారు.
తాను ఖమ్మం వెళ్లి వరద బాధితులను పరామర్శించానని హరీశ్‌రావు చెప్పారు. వారిని చూస్తే తన కళ్లలో కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మట్టి వినాయకుని పంపిణీ చేశారు. చెరువులను కాపాడడం మన అందరి బాధ్యత అని, మట్టి వినాయకులను పూజిద్దామని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చెరువులో చేపలు చనిపోతున్నవి, పర్యావరణం, చెరువులను కాపాడుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.
'ఖమ్మం వరద బాధితులకు సహాయం చేయడానికి సిద్దిపేట నుంచి సరకులు పంపిస్తున్నాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నాం. ఖమ్మం వరదలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సాయం అందించాలని చెప్పారు'-హరీశ్‌రావు, మాజీమంత్రి
ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా : రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడంపై మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా అని సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అన్న ఆయన, దీన్ని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి గారు.!
— Harish Rao Thanneeru (@BRSHarish) September 4, 2024
సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా… pic.twitter.com/1PUbP72mao
మూడు నెలలుగా జీతాలు ఇవ్వరని, అడిగినందుకు ఉద్యోగాల నుంచి తొలగిస్తారా అని హరీశ్‌రావు ఆక్షేపించారు. ఇదేనా ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారని మండిపడ్డారు.
మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.