What Happens if You Do Not Eat Rice For a Month : బియ్యంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తిని తక్షణమే అందిస్తాయి. అయితే.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం) వల్లైనా కొంత మేలు జరుగుతుందని.. కానీ మెజారిటీ జనం తినే పాలిష్డ్ రైస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు. అలాగే బరువు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
రెడ్ రైస్ గురించి మీకు తెలుసా? - అంత మంచిదా?
శరీరంలో వచ్చే మార్పులు ఇవే!
ఇలాంటి రైస్‌కు చిన్నప్పటి నుంచి అలవాటు పడిన జనాలు.. దాన్ని వదిలి ఉండలేకపోతున్నారు. అయితే.. ఒక నెల రోజులపాటు రైస్ తినకుండా ఉంటే మాత్రం పలు ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు. బరువు తగ్గే అవకాశం ఉందట. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయట. ముఖ్యంగా రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుందట. అయితే.. మళ్లీ అన్నం తినడం మొదలు పెడితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. బ్యాలెన్స్డ్ డైట్ కొనసాగిస్తూ.. అన్నం తక్కువగా తినాలని సూచిస్తున్నారు.
పరిశోధన వివరాలు..
2018లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం' జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఊబకాయం ఉన్న వారు ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోవడం వల్ల 2-3 కిలోల బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారట. ఈ పరిశోధనలో 120 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం విభాగం ప్రొఫెసర్ 'డాక్టర్. రాజేష్ కుమార్' పాల్గొన్నారు. ఒక నెలరోజుల పాటు పూర్తిగా అన్నం తినకుండా మానేసిన వారు రెండు నుంచి మూడు కేజీల బరువు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇలా చేయడం మంచిదేనా?
అయితే.. ఇలా పూర్తిగా అన్నం తినకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అన్నం పూర్తిగా తినకపోవడం వల్ల వారు శరీరంలో శక్తిని కోల్పోయి బలహీనంగా, నీరసంగా తయారవుతారని చెబుతున్నారు. వీరికి ప్రొటీన్ అందకపోవడం వల్ల కండరాలు క్షీణించే ఛాన్స్ ఉందట. అన్నం తినడం వల్ల మన శరీరానికి ఫైబర్ కూడా అందుతుంది. దీనికి దూరమైతే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుందట. కాబట్టి, అన్నం తక్కువగా తినాలని.. అదే సమయంలో అన్నంలో సగం కూర ఉండేలా కచ్చితంగా చూసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. బరువు తగ్గాలనుకునే వారు కావొచ్చు, షుగర్ బాధితులు కావొచ్చు.. ఉన్నట్టుండి ఇలాంటి కఠినమైన డైట్ మొదలు పెట్టకూడదని సూచిస్తున్నారు. తప్పకుండా వైద్యుల సలహా మేరకే పాటించాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇన్సులిన్ సమస్యలు, గుండె జబ్బులు దూరం! బ్రౌన్‌రైస్‌తో ఎన్నో లాభాలు