రూ.9200 చిల్లరతో 'MTech కూలీ' నామినేషన్ - MTech Laborer Nomination With Coins - MTECH LABORER NOMINATION WITH COINS
Published : Apr 5, 2024, 3:36 PM IST
MTech Laborer Nomination With Coins : లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఓ 'MTech కూలీ' రూ.9200 చిల్లరతో నామినేషన్ వేశారు. విరాళాల ద్వారా వచ్చిన నాణేలను డిపాజిట్‌గా ఎన్నికల అధికారికి సమర్పించారు. రూ.12,500 మొత్తంలో రూ.9200 నాణేల రూపంలో ఇచ్చారు. ఇన్ని నాణేలను చూసిన అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం తేరుకుని ఆ చిల్లరను డిపాజిట్‌గా స్వీకరించారు. అయితే ఈ చిల్లరను లెక్కించడానికి రిటర్నింగ్ అధికారి అదనపు సిబ్బందిని పిలిపించాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
బేతుల్ నియోజకవర్గానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి ఎంటెక్ చదువుకున్నారు. ఇందౌర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఓ ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అయితే కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం మానేసి గ్రామంలో వ్యవసాయం, కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. మూడేళ్ల కుమార్తె కోసం గ్రామంలోనే ఉంటున్నారు. అయితే సమాజంలో మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో సూభాష్ పోటీ చేస్తున్నారు.
ఇంతకుముందు జరిగిన లోక్‌సభ, అంసెబ్లీ, పంచాయతీ ఎన్నికల్లోనూ సుభాష్ పోటీ చేశారు. గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరడోంగ్రీ స్థానం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా బేతుల్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి కిసాన్ స్వతంత్ర పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిసారి లాగే నామినేషన్ డిపాజిట్ కోసం విరాళాలు సేకరించారు సుభాష్. వచ్చిన చిల్లర రూ.9200తో నామినేషన్ వేశారు. తన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సుభాష్ తెలిపారు. అంతేకాకుండా తన స్థాయిలో కొంత మార్పు తీసుకురావడం కోసం ఏదో ఒకరోజు ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు.