Special Article on the Problems Faced by Parents in Old Age : హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వయోవృద్ధురాలికి నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె పేరిట ఉన్న ఇంటిని విక్రయించి వచ్చిన డబ్బులతో బతకాలనుకుంది. చూస్తే అప్పటికే ఇల్లు ఒక కుమారుడి పేరిట గిఫ్ట్ డీడ్‌గా మారిపోయింది. దీంతో ఆ వృద్ధరాలు వయోవృద్ధుల మెయింటెనెన్స్ చట్టం కింద జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించడంతో పాటు గిఫ్ట్ డీడ్ రద్దు చేయించారు. వైద్యం చేయించాలని, నెలకు కొంత మొత్తం ఇవ్వాలని పిల్లలను ఆదేశించారు.
విశ్రాంత ఉద్యోగి ఒకరికి హైదరాబాద్ నడిబొడ్డున విలువైన ఇల్లుంది. పిల్లలు అమెరికాలో స్థిరడ్డారు. ఇంటిని అమ్మేసి వచ్చిన సొమ్ముతో బతకాలని అనుకున్నారు. అయితే, అద్దెదారు ఇంటిని ఖాళీ చేయబోనని బెదిరించారు. పిల్లలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వయోవృద్ధుల సంక్షేమ చట్టం కింద కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ ఆర్డీవో ద్వారా విచారణ చేయించి పోలీసు, రెవెన్యు యంత్రాంగం సాయంతో అద్దెదారుని ఖాళీ చేయించారు.
ఆస్తిపాస్తులను లాక్కునే ప్రయత్నం : అష్టకష్టాలను ఓర్చి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా పెంచి ప్రయోజకులను చేస్తే వారు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. ఖర్చులు భరించలేమని, వృద్ధాప్యంలో సేవలు చేయబోమంటూ ఇంటి నుంచి బయటకు పంపించేస్తున్న వాళ్లు ఎందరో. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడటంలేదు కానీ, వారి పేరిట ఉన్న ఆస్తిపాస్తులను మాత్రం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సంతానంలో ఒకరికి తెలియకుండా మరొకరు వృద్ధుల పేరిట ఉన్న ఆస్తుల్ని రాయించుకుని చివరి క్షణాల్లో వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
ఆదుకుంటున్న జిల్లా కలెక్టర్లు : ఈ పరిస్థితుల్లో వయోవృద్ధుల సంక్షేమ, నిర్వహణ చట్టం కింద ఆర్డీవోల ఆధ్వర్యంలోని ట్రైబ్యునళ్లు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని అప్పీలేట్ అథారిటీలు అవసరమైన సాయాన్ని చేస్తున్నాయి. బాగోగులు చూడాలని ఆదేశించడమే కాదు, పిల్లల పేరిట మారిన ఆస్తిపాస్తుల్ని తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాయి. నెలవారీ ఖర్చుల కోసం భృతి చెల్లించాలని సూచిస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం రెండేళ్ల వ్యవధిలో 3,308 మంది వృద్ధులు ఈ చట్టం కింద సాయం కోసం అధికారులను ఆశ్రయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
కౌన్సెలింగ్‌తో కొంతమందిలో మార్పు : సూటిపోటి మాటలు, ఇంట్లో వేధింపులు, కడుపు నిండా అన్నం దొరక్క చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పిల్లల పరువుకు ఇబ్బంది రాకూడదని కొందరు తల్లిదండ్రులు వారితోనే ఉంటూ అవన్నీ భరిస్తున్నారు. వేధింపులు మరింత తీవ్రం అయిన సందర్భంలో కొందరు, పోలీసులు, సంక్షేమ శాఖలు, ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. పిల్లలపై ప్రేమ, భావోద్వేగాల కారణంగా కొందరు ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌తో పలువురు పిల్లల్లోనూ మార్పు వస్తోంది. కౌన్సెలింగ్ తర్వాత మరోసారి ఫిర్యాదు వస్తే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నామని ఓ జిల్లా సంక్షేమాధికారి ఒకరు తెలిపారు.
వయోవృద్ధు ఫిర్యాదు కోసం సంక్షేమ శాఖ tgseniorcitizens.cgg.gov.in పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా లేదంటే మీ సేవా కేంద్రాల ద్వార రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటుంది. ఈ ఫిర్యాదులపై ప్రతి శుక్రవారం సంక్షేమ శాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, సమస్యల పరిష్కారానికి సాయం చేస్తారు.
- కౌన్సెలింగ్ నిర్వహించాక సమస్య పరిష్కారం కాకుంటే కేసు నమోదు చేయిస్తున్నారు.
- ఆర్డీవో ఆధ్వర్యంలోని ట్రైబ్యునళ్లకు వస్తున్న ఫిర్యాదుల్లో కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి.
మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా ? - వారి అవసరాలు తీరేలా ఇంటిని తీర్చిదిద్దుకోండిలా!
వృద్ధాప్యంలో తోడు కోసం ఒంటరి పెద్దల 'స్వయంవరం' - ఇప్పటికే 3 వేల మంది!