Significance of Using kanduva : ఈ రోజుల్లో జనాలు పెద్దగా భుజం మీద కండువా ఉపయోగించట్లేదుగానీ, పాత రోజుల్లో పంచె కట్టిన ప్రతిఒక్కరూ కండువా వేసుకునేవారు. లుంగీ ధరించిన వారు కూడా తప్పకుండా వాడేవారు. ఇప్పుడు కూడా పండగలు, పూజల సమయంలో నూతన పంచెలు ధరించిన వారు మెడలో కండువా కూడా వేసుకుంటారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో పైపంచె అని పిలుస్తారు. ఇంకా ఉత్తరీయం అని కూడా అంటారు.
అయితే, భుజాన ఈ కండువా వేసుకోవడం అలంకారం కోసం మాత్రమే కాదని, దానికి అనేక అర్థాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. భుజం మీద వేసుకుంటే ఒక అర్థం, నెత్తికి చుట్టుకుంటే మరొక అర్థం, మెడలో నుంచి వెనక్కి వేసుకుంటే వేరొక అర్థం, వెనక నుంచి ముందు వేసుకుంటే ఇంకొక అర్థమట. అందుకే, ఇక మీద కండువా ధరిస్తున్నప్పుడు ఏ అర్థంలో ధరిస్తున్నారో తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మరి, ఆ అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎడమ భుజం : రుమాలు ఎడమ భుజం మీద వేసుకుంటే అతనికి పెళ్లైందని, భార్యతో ఆనందంగా జీవిస్తున్నాడని అర్థమట.
కుడి భుజం : కండువా కుడి భుజం పైన వేసుకుంటే అది విషాదానికి సూచికగా పండితులు చెబుతున్నారు. అతని భాగస్వామి చనిపోయిందని అర్థమట!
ఇలా కూర్చుంటే : సగం కండువాను ఎడమ భుజం పైనుంచి వెనక్కి ఉంచి, మిగిలిన సగం కండువాను ముందుకు ఉంచి, మోకాళ్ల మీద ఎవరి ఎదురుగానైనా కూర్చొని, ముందు వైపున్న కండువా రెండు అంచులను రెండు చేతులు చాచి పట్టుకొని ఉన్నారంటే ఆశీస్సులు, అక్షింతలు అర్థిస్తున్నారని అర్థమట.
రెండు వైపులా : మెడ నుంచి రెండు వైపులా కండువాను ధరిస్తే, అది గౌరవానికి సూచికగా చెబుతున్నారు.
పాగా : తలకు చుట్టుకుంటే పాగా వేసేసినట్టు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా కార్యానికి, లేదా పని మొదలు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు అర్థమట.
నడుముకు : రుమాలు నడుము చుట్టుకుంటే అది వీరత్వానికి గుర్తు. అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో, తమలోని వీరత్వాన్ని ప్రదర్శించేందుకు కండువాను నడుముకు బలంగా ముడివేయడం మనకు తెలిసిందే.
ముఖం చుట్టూ : కండువాను ముఖం, చెవులను కవర్ చేస్తూ చుట్టుకుంటే అది రక్షణకు గుర్తు. చలి నుంచి గానీ, ఎండ నుంచి గానీ కాపాడుకునేందుకు ఇలా చేస్తుంటారు.
వెనక్కి ముడి వేస్తే : తల మొత్తాన్ని కండువాతో కవర్ చేసి, వెనక్కి ముడివేసి, అంచులు వేలాడదీస్తే దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం కట్టుకున్నట్టుగా భావించాలి.
తల, ముక్కు : కండువాతో నుదురు చుట్టూ చుట్టి తల మొత్తం కవర్ చేసి వెనక ముడేస్తారు. మళ్లీ ముక్కు, మూతి, మెడ మొత్తం కవర్ చేస్తూ వెనక ముడేస్తారు. కళ్లు తప్ప ఏమీ కనిపించవు. ఇలా కవర్ చేస్తే, ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకూడదని భావిస్తున్నారని అర్థం. నిజ జీవితంతోపాటు సినిమాల్లోనూ ఇలాంటి వాళ్లను చూడొచ్చు.
ముక్కు : కేవలం ముక్కును మాత్రమే కవర్ చేస్తూ వెనకాల ముడి వేస్తే, అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నారని అర్థం. అక్కడి దుర్వాసన నుంచి రక్షించుకుంటున్నారని అర్థం.
తల మీద : దివాళా తీసిన వారికి సూచికగా నెత్తిమీద కండువా వేసుకోవడాన్ని సినిమాల్లోనో, నాటకాల్లోనూ చూస్తూ ఉంటాం. తలపైన కండువా వేసుకుంటే అర్థం అదేనట. లేదా విచారంగా ఉన్నట్టుగా భావించాలట.
ఇవి కూడా చదవండి :
సూర్య బ్రోకు నిద్రే రాదు! - ఈ భూమ్మీద చీకటి పడని దేశాలు ఇవే!
ఆమె ఉద్యోగం వదిలేసింది - పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా బతికేస్తోంది!