ఒక్కటైన కొరియా అబ్బాయి, తమిళమ్మాయి- భారతీయ సంప్రదాయంలో పెళ్లి- డ్యాన్స్ చూశారా? - Korea Boy Marry Tamil Girl - KOREA BOY MARRY TAMIL GIRL
Published : May 20, 2024, 9:40 AM IST
Korea Boy Marry Tamil Girl : తమిళనాడుకు చెందిన ఓ యువతి సౌత్ కొరియా అబ్బాయిని ఘనంగా భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా కొరియా అబ్బాయితో అయిన పరిచయం ప్రేమగా మారడం వల్ల పెద్దల అంగీకారంతో ఒక్కటైయ్యారు. ఈ వివాహ వేడుకలో నవదంపతులు అందరితో డ్యాన్స్‌లు వేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరూర్ జిల్లాలోని నడయనూర్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి(28) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగం చేస్తోంది. ఇంగ్లీష్, కొరియన్ భాషల్లో తన కెరీర్ గురించి వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే సౌత్ కొరియాలోని డోంగ్యాంగ్కు చెందిన మిన్జున్ కిమ్(28)తో విజయలక్ష్మికి పరిచయం ఏర్పడింది. అలా వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో మార్చి నెలలో విజయలక్ష్మి సౌత్ కొరియాకు వెళ్లి మిన్ జుమ్ కుటుంబాన్ని కలిసింది. వాళ్ల ప్రేమను ఇరు కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో తన తల్లిదండ్రులు, ఇద్దరు స్నేహితులతో కలిసి కిమ్ ఇండియాకు వచ్చారు. శనివారం రాత్రి విజయలక్ష్మికి, కిమ్‌కు నిశ్చితార్థం జరిపించారు. ఈ వేడుకకు వచ్చిన వారితో కలిసి కొత్త జంట డాన్స్ చేసింది. ఆదివారం పెరుమాళ్ ఆలయంలో తమిళ సంప్రదాయం ప్రకారం పెళ్లి ఘనంగా జరిగింది.