WhatsApp Offline File Sharing Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. త్వరలో ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ఇకపై నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా మీ డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు.
సాధారణంగా నెట్‌వర్క్ సదుపాయం లేకున్నా బ్లూటూత్ సాయంతో షేర్ ఇట్, నియర్ బై షేర్ వంటి అప్లికేషన్ల ద్వారా ఫొటోలు, సినిమాలు పంపించుకోవచ్చు. అచ్చం ఆ తరహా సేవల్నే యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల ఎటువంటి ప్రత్యేక యాప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లను మరింత వేగంగా సురక్షితంగా పంపేందుకు వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంటే వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ లాంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
కాస్త దగ్గరగా ఉండాల్సిందే!
మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యేంత దగ్గర్లో ఉంటేనే ఆఫ్‌లైన్ షేరింగ్‌కు వీలవుతుంది. బ్లూటూత్ ఆన్ చేసి దగ్గర్లోని వాట్సాప్ యూజర్ పరికరాన్ని గుర్తించి ఫైల్ సెండ్ చేయాలి. అవతలి వ్యక్తి అనుమతి ఇస్తేనే ఈ తరహా షేరింగ్ సాధ్యమవుతుంది. వద్దనుకుంటే ఆఫ్ చేసే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.