WhatsApp Event Planning Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తెస్తునే ఉంది. అందులో భాగంగా తాజాగా వాట్సాప్ 'ఈవెంట్ ప్లానింగ్' ఫీచర్‌ను తీసుకువచ్చింది. ప్రధానంగా వాట్సాప్ కమ్యూనిటీస్ (WhatsApp Community)లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గ్రూప్ మెసేజ్ల్లోనే నేరుగా ఈవెంట్లను ప్లాన్ చేయడానికి, వాటిని నిర్వహించడానికి వీలవుతుంది.
Event Planning In WhatsApp Community :ఈ వాట్సాప్ ఈవెంట్ ప్లానింగ్ ఫీచర్ ఉపయోగించి స్నేహితులతో, సన్నిహితులతో, సహచర ఉద్యోగులతో వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. లేదా వ్యక్తిగత సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
మనం ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపే విధంగానే, వాట్సాప్ ఈ సరికొత్త 'ఈవెంట్స్ ప్లానింగ్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గ్రూప్ సభ్యుల పుట్టిన రోజు పార్టీలు, వర్క్ మీటింగ్‌లు సెటప్ చేసుకోవచ్చు. ఈవెంట్ సెటప్ అయిన తరువాత అవి గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజ్‌కు పిన్ అయ్యి ఉంటాయి. కనుక అందరికీ ఈవెంట్ విషయం తెలుస్తుంది. అంతేకాదు గ్రూప్ చాట్ థ్రెడ్ కూడా క్రియేట్ అవుతుంది. అందువల్ల ఎవరెవరికీ మెసేజ్ చేరిందో తెలుస్తుంది.
ఈవెంట్‌కు వచ్చేవారు కూడా రిప్లై ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి వారికి ఈవెంట్ సమయానికి ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వెళుతుంది. కనుక మర్చిపోయే అవకాశం బాగా తగ్గుతుంది. వాట్సాప్ ఈ నయా ఫీచర్‌ను తొలుత వాట్సాప్ కమ్యూనిటీలో ప్రవేశపెడుతోంది. దీని తరువాత త్వరలోనే వాట్సాప్ గ్రూప్‌లకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది.