Why Users Leaving Elon Musks X:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ఎలాన్ మస్క్ షేర్లు రాణించడం అందరికీ తెలిసిందే. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఎలాన్ మస్క్‌ను ఒక విషయం మాత్రం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇందుకు కారణం మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ 'ఎక్స్'ను అమెరికన్లు పెద్ద సంఖ్యలో విడిచిపెట్టి పోవటం.
ఇలా ఎక్స్‌ను వీడి వెళ్లిన వారంతా 'బ్లూ స్కై' అనే కొత్త సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అనతి కాలంలోనే ఇది 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. భారీ వృద్ధితో అమెరికాలో యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ ఛార్ట్‌లో నిలిచింది. అయితే అమెరికన్లు ఇలా భారీ సంఖ్యలో 'ఎక్స్'ను ఎందుకు వీడుతున్నారు? దీనికి కారణం ఏంటంటే?
కారణం ఇదే!: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ ప్రచారానికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడంతో పాటు బలమైన మద్దతు అందించారు. ఇది కొంతమంది అమెరికన్లకు రుచించలేదు. దీంతో కొన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ట్రంప్ కూడా ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆ వ్యతిరేకత తీవ్రరూపం దాల్చినట్లయింది.
ఇక ఎక్స్ రైట్-వింగ్ భావజాలానికి మాత్రమే మొగ్గు చూపుతుందని భావించిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టారు. అంతేకాక 'ఎక్స్' తాజా నిబంధనలు కూడా ఇందుకు మరో కారణమైంది. మస్క్ రూపొందించిన ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్'కు యూజర్స్ పోస్ట్ చేసే కంటెంట్‌ను శిక్షణ కోసం వాడుకుంటామని ప్రకటించడంపై చాలా మంది వ్యతిరేకించారు.