Android Camera Tips And Tricks : మీ దగ్గర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉందా? అయితే మీరు కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌కు ధీటుగా తయారు కావచ్చు. కొన్ని టూల్స్, ఫీచర్స్, ప్రత్యేకమైన సెట్టింగ్స్‌ను వినియోగించుకొని హై క్వాలిటీ ఫొటోలను ఫోన్ కెమెరాలోనే బంధించవచ్చు. ఇందుకోసం మీరు ఫోటోగ్రఫీలో డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని టిప్స్ గురించి తెలుసుకుంటే చాలు. ఇక మీ ఫొటోలకు లైకులు వెల్లువెత్తడమే తరువాయి.
1. గ్రిడ్స్
ఫోన్ కెమెరాలో ఫొటోను తీసేటప్పుడు గ్రిడ్స్ ఫీచర్‌ను వాడటం బెటర్. మొత్తం 9 దీర్ఘచతురస్ర గ్రిడ్స్కుగానూ కనీసం మూడోవంతు భాగంలో సీన్ కవరయ్యేలా చూడాలి. ఇలా చేస్తే ఫొటో ఫ్రేమింగ్‌లో చాలా కచ్చితత్వం ఉంటుంది. సీన్ సమగ్రంగా కెమెరాలో కవర్ అవుతుంది. ఈ గ్రిడ్స్‌ను మనం ఎంత సమర్ధంగా వాడుకుంటే, ఫొటో అంత క్వాలిటీతో వస్తుంది. ఫోన్ వినియోగదారులు కెమెరా యాప్‌లోని సెట్టింగ్‌లలోకి వెళ్లి గ్రిడ్ లైన్లను ఆన్ చేయాలి. కొద్దిగా భిన్నమైన గోల్డెన్ రేషియో కోసం గ్రిడ్ లైన్ల వంటి అదనపు ఆప్షన్లను కూడా వాడుకోవచ్చు.
2. హై డైనమిక్ రేంజ్
హై డైనమిక్ రేంజ్ (హెచ్డీఆర్) అనే ఫీచర్ టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ప్రభావంతో ఫొటోలకు అదనపు మెటాడేటా జత కలుస్తుంది. తద్వారా మనం ఫొటోను తీసేటప్పుడు ఏయే కలర్ ఎంతెంత మోతాదులో ఉండాలనే దానిపై గైడెన్స్ లభిస్తుంది. హెచ్డీఆర్ ఫీచర్ కారణంగా రంగులకు సంబంధించిన గైడెన్స్‌ను స్క్రీన్ మనకు లెక్కలేసి మరీ చెప్పగలుగుతుంది. వాస్తవానికి అన్ని స్మార్ట్‌ఫోన్ కెమెరాలలో హెచ్డీఆర్ ఫీచర్ అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ ఉండాలంటే ఫోనులో 1000 నిట్ల బ్రైట్నెస్ రేటింగ్‌తో డిస్ప్లే అవసరం. సరికొత్త మోడళ్ల ఫోన్లలోనే హెచ్డీఆర్ ఫీచర్ లభిస్తుంది. ఫోనులోని కెమెరాను ఓపెన్ చేసి, స్క్రీన్‌పై ఉన్న హెచ్డీఆర్ బటన్‌ను నొక్కాలి. శాంసంగ్ హెచ్డీఆర్10+ అనేది హెచ్డీఆర్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఇది కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లలోనే అందుబాటులో ఉంటుంది.
3. లాక్ స్క్రీన్ నుంచి కెమెరాను తెరవడం
చాలా మందికి లాక్ స్క్రీన్ నుంచి కెమెరా యాప్‌ను తెరవడం ఎలాగో తెలియదు. వాస్తవానికి ఇది చాలా ఈజీ. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అందులోని 'సిస్టమ్' అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇందులో 'గెశ్చర్స్' అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే 'ఎనేబుల్ కెమెరా క్విక్ లాంఛ్' అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఫోన్లోని పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేయగానే కెమెరా తెరుచుకుంటుంది. కెమెరా విడ్జెట్‌ను లాక్ స్క్రీన్‌పై ఉంచుకోవడం ద్వారా కూడా వెంటనే మనం కెమెరాను తెరవొచ్చు.
4. ట్రైపాడ్
స్మార్ట్‌ఫోన్‌ను చేతిలో పట్టుకొని ఫొటోలు తీసేటప్పుడు, మన చేతులు వణికే అవకాశం ఉంటుంది. దీనివల్ల మొత్తం ఫొటో ఫ్రేమ్ చెదిరిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, ట్రైపాడ్‌ను వాడాలి. మీరు టైమ్ లాప్స్ వీడియో తీయాలనుకున్నప్పుడు కూడా ట్రైపాడ్ చాలా ఉపయోగపడుతుంది. ఫోన్ నిశ్చలంగా ఉండటం వల్ల ఫొటో క్లారిటీ అద్భుతంగా వస్తుంది. ఫొటో షాట్లకు మంచి యాంగిల్‌ను ఎంపిక చేసుకునేందుకు కూడా ట్రైపాడ్లు అనువుగా ఉంటాయి.
5. అరచేతితో సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు
గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి చాలా ఉపయోగపడే ఫీచర్ 'పామ్ డిటెక్షన్'. కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'పామ్ డిటెక్షన్' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అనంతరం మీరు ఫొటో దిగేటప్పుడు, అరచేతిని కెమెరా లెన్స్ వైపు చూపించాలి. ఆ వెంటనే 3 సెకన్ల టైమర్ ఆన్ అవుతుంది. అది సున్నాకు చేరగానే కెమెరా మన గ్రూప్ ఫొటో లేదా సెల్ఫీ ఫొటోను తనలో బంధిస్తుంది. ఫొటో తీసేందుకు ఎవరూ లేని టైంలో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్‌ను వాడే క్రమంలో మనం ఫ్రంట్ కెమెరాను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అందువల్ల ఫొటో క్వాలిటీ అంత బెటర్‌గా రాకపోవచ్చు.