Spacex Crew 8 Successfully Reached Earth: నాసా స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక క్రూ-8 విజయవంతంగా భూమి పైకి తిరిగి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 12:59 గంటలకు ఫ్లోరిడాలోని పెన్సకోలా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఏడు నెలలు గడిపిన అమెరికన్, రష్యన్ వ్యోమగాములను తీసుకొచ్చింది. విజయవంతమైన స్ప్లాష్‌డౌన్ తర్వాత స్పేస్ ఎక్స్ రికవరీ టీమ్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను భద్రపరిచారు. అనంతరం వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహించి హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు.
ఆ తర్వాత క్రూ-8 మిషన్, వ్యోమగాములు తిరిగి రావడంపై నాసా, స్పేస్‌ఎక్స్ మీడియా టెలికాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఆరోగ్యం, మెటీరియల్ సైన్స్, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో 200 కంటే ఎక్కువ ముఖ్యమైన శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఈ మిషన్ బృందం భూమికి తిరిగి వచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు చేరుకున్న 233 రోజుల తర్వాత ఈ బృందం స్పేస్‌ఎక్స్ ఎండీవర్ ప్రోబ్‌లో దిగింది. ఈ నలుగురు సభ్యుల మిషన్ దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలకు అవసరమైన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడిందని నాసా తెలిపింది.
నాసా వ్యోమగాములు మాథ్యూ డొమినిక్, మైఖేల్ బారెట్, జీనెట్ ఎప్స్, అలాగే రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గ్రెబెంకిన్.. మార్చిలో క్రూ డ్రాగన్ ఎండీవర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ నలుగురు సభ్యుల మిషన్ బృందం ఆగస్ట్‌లో తిరిగి వస్తుందని మొదట్లో నాసా తెలిపింది. అయితే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా అది ఆలస్యమైంది. స్టేషన్లో అడిషనల్ స్టాఫ్ సపోర్ట్ అవసరం పడటమే దీనికి కారణం. ఆ తర్వాత అక్టోబర్ 7న తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ మిల్టన్ తుపాను కారణంగా అది కూడా వాయిదా పడింది.