Humanoid Robot Artwork Sold at Auction: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అడుగడుగునా ఏఐ మన వెన్నంటే ఉంటుంది. విద్య నుంచి వైద్యం, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో విస్తరించి ప్రపంచ రూపురేఖలను మారుస్తోంది. దాదాపు అన్ని రంగాల్లోకి ప్రవేశించిన ఏఐ టెక్నాలజీ ఇప్పుడు పెయింటింగ్ రంగంలోకి కూడా ప్రవేశించింది. ఏఐ రోబోట్ గీసిన పెయింట్ వేలంలో భారీ మొత్తానికి అమ్ముడైంది. ఇది మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిందంటే నమ్ముతారా?
అయితే ఈ నిజాన్ని నమ్మాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహులలో ఒకరిగా పేరొందిన అలాన్ ట్యూరింగ్ పోర్ట్రెయిట్ ఇటీవలి వేలంలో మిలియన్ల డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఆర్టిస్ట్ ఐ-డా గీసింది. సోథెబీస్ డిజిటల్ ఆర్ట్ సేల్‌లో 'ఏఐ గాడ్' గా పేరొందిన బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడి పెయింటింగ్ $1,084,800 (సుమారు రూ. 9.15 కోట్లు)కి అమ్ముడుపోయింది.
హ్యూమనాయిడ్ రోబో ఆర్టిస్ట్ ఐ-డా గీసిన ఈ పోర్ట్రెయిట్‌కు వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి 27 కంటే ఎక్కువ బిడ్లు వచ్చాయి. చివరకు అమెరికాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కొనుగోలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పెయింటింగ్ నిర్వాహకుల అంచనాలకు మించి $180,000 (రూ. 5 కోట్లు)ని అధిగమించింది.
ఏంటీ ఐ-డా..?: ఐ-డా అనేది ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్. కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా గుర్తింపు పొందిన 19వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు అడా లవ్‌లేస్ పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌ను UKలోని ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాలకు చెందిన ఏఐ పరిశోధకులతో సహా 30 మంది వ్యక్తుల టీమ్‌తో పాటు మాజీ గ్యాలరీ ఓనర్, మోడ్రన్ ఆర్ట్‌లో స్పెషలిస్ట్ ఐడాన్ మెల్లర్ 2019లో అభివృద్ధి చేశారు.