Telugu Person Appointed As IARI Director : ప్రతిష్టాత్మక ఐసీఏఆర్ - ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ - నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ - నార్మ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు, ఐఏఆర్‌ఐ అధిపతిగా ఎంపికైన తొలి తొలుగు శాస్త్రవేత్త కావడం విశేషం. తెలుగు వారికి గర్వకారణం అని చెప్పవచ్చు.
తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం : ఇవాళ సాయంత్రం దిల్లీలో ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా నివాసరావు బాధ్యతలు స్వీకరించారు. 1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు, 1975-80 వరకు అనిగండ్లపాడు జడ్‌పీహెచ్‌ఎస్‌లో ప్రాధమిక విద్య అభ్యసించారు. జగ్గయ్యపేటలో ఎస్‌జీఎస్ పూర్తి చేశారు. వ్యవసాయంపై మక్కువతో రైతులకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో బాపట్లలో వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్‌సీ పట్టా అందుకున్నారు. అనంతరం న్యూఢిల్లీ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్ టెల్ - అవివ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ విజయవంతంగా పూర్తి చేశారు.
1992లో భోపాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ - ఐఐఎస్‌ఎస్‌లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. ఆరేళ్లపాటు అదే సంస్థలో రైతులతో మమేకమై పని చేశారు. 1998-2003 వరకు కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ - ఐఐపీఆర్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా సేవలందించిన శ్రీనివాసరావు, 2003-2006 వరకు హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ - క్రీడా ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేసి తెలుగు రాష్ట్రాల రైతాంగం మన్ననలు పొందారు. ఈ క్రమంలో 2006-13 వరకు ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ - ఏఐసీఆర్‌పీడీఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పని చేశారు.
నార్మ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కృషి : 2013-14 వరకు ఇక్రిశాట్‌లో సేవలందించిన శ్రీనివాసరావు, పదోన్నతిపై 2014-17 వరకు మళ్లీ క్రీడా సంస్థలో డైరెక్టర్‌గా పని చేసి వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. ఈ నేపథ్యంలో 2017లో హైదరాబాద్ రాజేంద్రనగర్ నార్మ్ డైరెక్టర్‌గా చేరారు. తన సుధీర్ఘ కాలంలో నార్మ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో శాస్త్రవేత్తగా ఎంపికైన ప్రతి ఒక్కరూ నార్మ్‌లో శిక్షణ పొందాల్సిందే. గత రెండు మూడేళ్ల కిందట నార్మ్ సంస్థను జాతీయ స్థాయి థింక్ ట్యాంకుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం, రైతాంగం, ఇతర అంశాలపై విధానపరమైన అంశాలు రూపకల్పన బాధ్యతలు మోదీ సర్కారు నార్మ్ సంస్థకు అప్పగించింది. దేశంలో పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేసిన శ్రీనివాసరావు 2019లో వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు ప్రతిష్టాత్మక రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డు అందుకున్నారు. అదే ఏడాది సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయ ఇంజనీరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న శ్రీనివాసరావు, అవే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు స్వీకరించారు. దేశంలో పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేసి తనదైన శైలి చూపించారు.
ఐఏఆర్‌ఐ డైరెక్టర్ కావడం సంతోషంగా ఉంది : హరిత విప్లవం పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ లాంటి దిగ్గజం పని చేసిన ప్రతిష్టాత్మక సంస్థకు డైరెక్టర్‌గా నియమితులు కావడం విశేషం. శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనకు జాతీయ స్థాయిలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ శ్రీనివాసరావు "ఈటీవీ భారత్"తో అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం, రైతాంగ సంక్షేమం దృష్ట్యా పరిశోధనలు, విద్య, విస్తరణ, విజ్ఞానం, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం చేసే ప్రయత్నం చేస్తానని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
UNOలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి - పర్వతనేని హరీశ్‌ను నియమించిన కేంద్రం - uno indian ambassador