Cash Bag Theft in Private Travels : బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోపు రూ.23 లక్షలు ఉన్న బ్యాగును దుండగులు దొంగలించారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపాలపల్లి శివారులోని జాతీయ రహదారిపై ఉన్న పూజిత హోటల్ వద్ద జరిగింది. ఈ చోరీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, బాపట్లకు చెందిన వెంకటేశ్ అనే యువకుడు రూ.23 లక్షలతో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎక్కి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల సమయంలో నార్కట్‌పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి బస్సు ఆపడంతో అందరితో పాటు వెంకటేశ్ కూడా దిగాడు. అయితే రూ.23 లక్షలు ఉన్న బ్యాగును బస్సులో ఉంచి హోటల్‌లోకి వెళ్లి టిఫిన్ చేసి వచ్చి బస్సులో చూడగా డబ్బులు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.23 లక్షలు ఉన్న బ్యాగును బస్సులో వదిలేసి, అంత నిర్లక్ష్యంగా టిఫిన్ చేయడానికి ఎలా వెళ్తాడని బాధితునిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
పట్టపగలే ఎంత పనిచేశావయ్యా - బైక్ బ్యాగ్లో నుంచి డబ్బు కాజేసిన దొంగ