Former PM Manmohan Singh Passed Away : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపం తెలపనుంది. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
మన్మోహన్ బయోగ్రఫీ
- పుట్టిన తేదీ: 26 సెప్టెంబరు 1932
- జన్మస్థలం: మా, పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)
- వివాహం: 14 సెప్టెంబరు 1958
- కుటుంబం: భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్
- చదువు: పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా
- కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్
- ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)
- హోనరిస్ కాసా నుంచి డి.లిట్
ఎన్నో పదవులు
13వ భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. 2004-2014 మధ్య భారత ప్రధానిగా మన్మోహన్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్‌కు వచ్చింది. మన్మోహన్ 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. 1991-96 మధ్య పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఆర్థికమంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1998-2004 మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. సుమారు 33 ఏళ్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అంతేకాకుండా యూజీసీ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గానూ సేవలందించారు డాక్టర్ మన్మోహన్ సింగ్.
మన్మోహన్ ఘనతలు
మన్మోహన్ ప్రతిరోజు 18 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులను శక్తిమంతంగా తీర్చిదిద్దారు. దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. 2005లో విప్లవాత్మక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. మన్మోహన్ హయాంలోనే అత్యధిక జీడీపీ(10.8శాతం) వృద్ధిరేటు నమోదు చేసి రికార్డు సాధించింది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్లు కేటాయింపు జరిగింది. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు సృష్టించారు.
పురస్కారాలు
మన్మోహన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో పద్మవిభూషణ్ ప్రదానం చేసింది. 2017లో మన్మోహన్ సింగ్‌ను ఇందిరా గాంధీ బహుమతి వరించింది. 1993, 94 ఉత్తమ ఆర్థికమంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు మన్మోహన్. 2010లో ఆయనకు వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు వచ్చింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు కూడా దక్కించుకున్నారు.