Realme 14 Pro vs Redmi Note 14 Pro: రియల్‌మీ ఇండియా తన కొత్త 'రియల్‌మీ 14 ప్రో' సిరీస్‌ను నిన్ననే అంటే జనవరి 16, 2025న లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ 'రియల్‌మీ 14 ప్రో', 'రియల్‌మీ 14 ప్రో ప్లస్' అనే రెండు మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్లలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ ఫ్లాష్ కెమెరా ఉంది. అంతేకాక ఈ సెగ్మెంట్ ఫోన్‌లో మాత్రమే క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది.
వీటితో పాటు వినూత్న రీతిలో ఉష్ణోగ్రతను బట్టి కలర్స్ మార్చే టెక్నాలజీతో కంపెనీ ఈ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల సేల్స్ జనవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే భారత్‌లో రియల్‌మీకి బిగ్గెస్ట్ కాంపెటీషన్ షావోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మీతో నడుస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ రెండు సంస్థలూ దాదాపు ఒకే రేంజ్ ధరలో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఈసారి కూడా రియల్‌మీ కొత్త స్మార్ట్ఫోన్ల విషయంలో ఇలానే జరుగుతోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ కొత్త ఫోన్ 'రియల్‌మీ 14 ప్రో 5G', మరో చైనీస్ ఫోన్ కంపెనీ 'రెడ్‌మీ రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G' ఫోన్‌తో పోటీ పడబోతోంది. రెడ్‌మీ ఈ ఫోన్‌ను 9 డిసెంబర్ 2024న అంటే దాదాపు ఒక నెల క్రితం లాంఛ్ చేసింది. ఈ సందర్భంగా వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్? ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాల కోసం ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల కంపారిజన్ మీకోసం. వీటిని బట్టి వాటిలో మీకు ఏది ఉత్తమ ఎంపిక అనేది మీరే తెలుసుకోవచ్చు.
1. డిజైన్ కంపారిజన్:
రియల్‌మీ 14 ప్రో 5G:
- ఈ ఫోన్ పొడవు 162.8mm, వెడల్పు 74.9mm, మందం 7.6mm. ఇక దీని బరువు 179 గ్రాములు. ఈ ఫోన్ పెర్ల్ వైట్, పింక్, గ్రే కలర్ ఆప్షన్లలో మార్కెట్లో లాంఛ్ అయింది. దీని పింక్, గ్రే కలర్ వేరియంట్లు వీగన్ లెదర్ బ్యాక్ డిజైన్‌తో వస్తాయి. కానీ దాని పెర్ల్ వైట్ కలర్ మోడల్ వినూత్న కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో హీట్ ఎక్కువైతే కంట్రోల్ చేసేందుకు థర్మోక్రోమిక్ పిగ్మెంట్స్ ఉన్నాయి.
- అంతేకాక ఇది టెంపరేచర్ పెరిగితే సిగ్నల్ కూడా అందిస్తుంది. ఉష్ణోగ్రత 16°C కంటే తక్కువ ఉంటే ఇది పెర్ల్ వైట్ నుంచి వైబ్రెంట్ బ్లూ కలర్లోకి మారుతుంది. టెంపరేచర్ పెరిగేకొద్దీ ఇది రివర్స్ అవుతుంది. వీటితో పాటు ఈ మోడల్ ఫోన్ IP66, IP68, IP69 వాటర్ రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాలు ఉంచినా ఏంకాదని కంపెనీ చెబుతోంది.
రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G:
- ఇక 'రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G' స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే ఇది 162.33mm పొడవు, వెడల్పు 74.42mm, మందం 8.4mm. ఈ ఫోన్ బరువు 190 గ్రాములు. ఈ ఫోన్ బ్లూ, పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు లెదర్, ప్లాస్టిక్ బ్యాక్ డిజైన్‌తో వస్తాయి. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీతో IP68 రేటింగ్‌తో వస్తాయి.
2. డిస్‌ప్లే కంపారిజన్:
- రియల్‌మీ 14 ప్రో 5G:ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల కర్వ్డ్ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ FHD+ 1080x2392 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీని యాస్పెక్ట్ రేషియో 19.9:9, స్క్రీన్ టు బాడీ రేషియో 93.7%. ఈ ఫోన్ పంచ్-పోల్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ TÜV రీన్‌ల్యాండ్ రగ్డ్ స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్, మిలిటరీ గ్రేడ్ షాక్-రెసిస్టెన్స్ టెస్ట్‌లో పాస్ అయింది. ఈ కారణంగానే ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని కంపెనీ గట్టిగా చెబుతోంది. అయితే ఈ డిస్‌ప్లే HDR 10+ కి సపోర్ట్ చేయదు.
- రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G: 'రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G' స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది FHD+ 1220x2712 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 120Hz, పీక్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్. దీని యాస్పెక్ట్ రేషియో 20:9, స్క్రీన్ టు బాడీ రేషియో 93.85%. ఈ ఫోన్ పంచ్-పోల్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, HDR 10+ సపోర్ట్‌తో వస్తుంది.
3. ప్రాసెసర్ కంపారిజన్:
- రియల్‌మీ 14 ప్రో 5G:ఈ 'రియల్‌మీ 14 ప్రో 5G' ఫోన్ ఆక్టా-కోర్ (2.5 GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A78 + 2 GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A55) CPUతో కూడిన 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్తో వస్తుంది. దీనిలో గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC2 ఉపయోగించారు. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ 8GB LPDDR4X RAM తో వస్తుంది.
- రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G:ఈ ఫోన్ ప్రాసెసర్ కోసం 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ ఆక్టా-కోర్ (2.5 GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A78 + 2 GHz, క్వాడ్ కోర్, కార్టెక్స్ A55) CPU, మాలి-G615 MC2 గ్రాఫిక్స్ అంటే GPUతో వస్తుంది. ఈ ఫోన్ 8GB LPDDR4X RAM సపోర్ట్‌తో వస్తుంది.
4. బ్యాక్ కెమెరా కంపారిజన్:
రియల్‌మీ 14 ప్రో 5G:
- ఈఫోన్ వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్ మెయిన్ కెమెరా సోనీ IMX882 50MP సెన్సార్‌తో వస్తుంది. ఇది f/1.8 ఎపర్చరు, 79 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ వైడ్ యాంగిల్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ సెకండ్ బ్యాక్ కెమెరా 2MP మోనో కెమెరా సెన్సార్‌తో వస్తుంది. దీని ఎపర్చరు రేటు f/2.4. ఫోన్లోని ఈ కెమెరాలు OIS సపోర్ట్, కాంట్రాస్ట్ డిటెక్షన్, ఆటోఫోకస్, ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ ఫీచర్లతో వస్తాయి.
- ఈ ఫోన్ వెనక కెమెరా సెన్సార్లతో పాటు ట్రిపుల్ అంటే మూడు LED ఫ్లాష్ లైట్లు అమర్చారు. దీని కెమెరాలో 20x డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, ఫిల్టర్లు, టచ్ టు ఫోకస్ ఫీచర్లు ఉన్నాయి.
- అంతేకాక ఈ కెమెరాలు కంటిన్యూయస్ షూటింగ్, HDR, స్ట్రే మోడ్‌తో సహా మొత్తం మూడు షూటింగ్ మోడ్‌లను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ కెమెరాతో మీరు 30fps వద్ద 4K వీడియోను షూట్ చేయొచ్చు. డ్యూయల్ వీడియో రికార్డింగ్, స్లో-మోషన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.