Royal Enfield Bikes Sales Report:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లకు మన దేశంలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. దీంతో ఈ బ్రిటిష్ వాహన తయారీ సంస్థ 2024లో భారత్‌లో అత్యధిక సేల్స్ రాబట్టింది. గతేడాది హైయెస్ట్ బైక్స్ విక్రయించి మునుపటి సేల్స్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. గతేడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,57,378 యూనిట్లను విక్రయించింది. 2023లో విక్రయించిన బైక్‌ల కంటే ఇది 4 శాతం ఎక్కువ. 2023లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,22,295 యూనిట్లు అమ్ముడయ్యాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యధిక సేల్స్: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో '350cc' మోడల్స్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. SIAM ఇండస్ట్రీ డేటా ప్రకారం.. కంపెనీ 2024 ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో 5,25,568 యూనిట్లను విక్రయించింది. ఇది ఏప్రిల్-నవంబర్ 2023లో విక్రయించిన వాహనాల కంటే 0.05 శాతం ఎక్కువ. ఈ సెగ్మెంట్లో 'బుల్లెట్ 350', 'క్లాసిక్ 350' వంటి బైక్‌లు ఉన్నాయి.
బజాజ్ కంటే వెనుకబడి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్:రాయల్ ఎన్‌ఫీల్డ్ '350-500cc' సెగ్మెంట్ గురించి మాట్లాడితే ఇందులో 'గెరిల్లా 450', 'హిమాలయన్ అడ్వెంచర్' వంటి మోడల్ బైక్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 27,420 యూనిట్లను విక్రయించింది. అయితే ఈ విభాగంలో బజాజ్ ఆటో మొత్తం మార్కెట్‌లో ముందుంది. బజాజ్ ఈ సెగ్మెంట్లో 44,491 యూనిట్ల సేల్స్‌ను అందుకుంది. ఇది మొత్తం మార్కెట్ వాటాలో 51 శాతం. ఈ విభాగంలో బజాజ్ 56 శాతం వృద్ధిని సాధించింది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ 500-800cc సెగ్మెంట్ విషయానికి వస్తే.. ఈ విభాగంలో 47 శాతం పెరిగి 33,152 యూనిట్లకు చేరుకుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బెస్ట్ సేల్స్: గత 12 ఏళ్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాల నివేదికను పరిశీలిస్తే.. 2024 క్యాలెండర్ ఇయర్ కంపెనీ 8 లక్షల యూనిట్ల విక్రయాలను అందుకున్న మూడో సంవత్సరం. అయితే ప్రస్తుతం కంపెనీ రికార్డు స్థాయిలో 8,57,378 యూనిట్లను విక్రయించి 2018 అత్యుత్తమ సేల్స్ గణాంకాలను కూడా అధిగమించింది. CY2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,57,378 యూనిట్లను విక్రయించింది. CY2018లో 8,37,669 యూనిట్లు అమ్ముడయ్యాయి.