Hydra Commissioner Orders Survey Of All Ponds : హైడ్రా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాల్లోని నిర్మాణాలన్నీ నేలమట్టం అవుతాయని, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో నగరంలో ప్రజలు జీవించలేరంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. తుది నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగకుండా వెంటనే అన్ని చెరువులను సర్వే చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆగస్టు తర్వాత జరిగినటువంటి ప్రతి నిర్మాణాన్ని గుర్తించాలని, వారం రోజుల్లోగా వాటిని కూల్చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా బుల్డోజర్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే గుర్తించిన బీరంగూడ, గాజులరామారం, తదితర చెరువుల సంరక్షణకు కాలు దువ్వుతున్నాయి.
నిబంధనల ప్రకారం : 2024 జులైలో హైడ్రా ఏర్పాటైందని అంతకు ముందు వాటిని (అనుమతి ఉన్నా, లేకున్నా) కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. వ్యాపారం కోసం కట్టుకున్నటువంటి షెడ్లను కూల్చుతామన్నారు. ఆగస్టు, 2024 నుంచి చేపట్టినటువంటి నిర్మాణాలు మాత్రం నేలమట్టం చేయనున్నట్లు తెలిపారు. ఏదో ఓ రోజు కూల్చేస్తాం" హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
ఉపగ్రహ చిత్రాలు(శాటిలైట్ ఇమేజీలు) ఆధారంగా : ఔటర్ రింగ్ రోడ్డు(బాహ్య వలయ రహదారి) వరకు గ్రామాల వారీగా అన్ని చెరువులను సర్వే చేసి, బఫర్ జోన్ లోపల కట్టిన నిర్మాణాలను గుర్తించాలని హైడ్రా నిర్ణయించింది. అందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), సర్వే ఆఫ్ ఇండియా, గూగుల్ పటాలను ఉపయోగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్, జులై నెలల్లో చిత్రీకరించిన చెరువుల ఉపగ్రహ చిత్రాలను, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోని పటాలను పరిశీలించాలని, చెరువుల అంచుల్లో చోటు చేసుకున్న వ్యత్యాసాలను లెక్క తేల్చాలని చెప్పారు.
ప్రాథమిక నోటిఫికేషన్ చాలు : ఇప్పటి వరకు చెరువులో ఇల్లు ఉందని అధికారులు వెళ్తే మీ వద్ద హద్దులు తెలిపే పటాలున్నాయా? అని ఆక్రమణదారులు ప్రశ్నిస్తూ వచ్చారు. చెరువు ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్‌లను నిర్ణయిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం, దానిపై ప్రజల నుంచి కంప్లైంట్లు, అభ్యంతరాలను స్వీకరించడం, వాటిని చట్టపరిధిలో పరిష్కరించి తుది నోటిఫికేషన్ ఇచ్చాకే చెరువుకు నిజమైన హద్దులను నిర్ధారించినట్లు అనే అభిప్రాయం ప్రజల్లో, అధికారుల్లో ఉండటమే అందుకు కారణంమని తెలుస్తోంది.
అదే అదనుగా నీటి పారుదలశాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన పలువురు అధికారులు తుది నోటిఫికేషన్ విడుదల కాని చెరువుల విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తూ వచ్చారు. ఫలితంగా వందలాది తటాకాలు(చెరువులు) ఆక్రమణలతో కనుమరుగయ్యాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాంటి వాదనను తోసిపుచ్చారు. చెరువులోని నిర్మాణాలను గుర్తించడానికి ప్రాథమిక నోటిఫికేషన్ సరిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం 51చెరువులకే తుది నోటిఫికేషన్ జారీ అయిందని, మిగిలిన అన్నింటికీ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ఆక్రమణలను కూల్చివేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.
హైడ్రా పోలీస్ స్టేషన్ - ఆక్రమణదారులంతా ఇక అక్కడికే!
అక్రమ కట్టడాల కూల్చివేతలో వెనకడుగు లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్