Ola Electric shares: ఎలక్ట్రిక్ టూ- వీలర్ రంగంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు మరోసారి పతనమయ్యాయి. గడిచిన రెండు నెలల్లోనే రికార్ట్ గరిష్ఠాల నుంచి ఏకంగా 43 శాతం పడిపోయాయి. ఈ కంపెనీ షేర్లు మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఇచ్చాయి. అయితే ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు వరుసగా పడిపోతుండటం గమనార్హం.
కంపెనీ సర్వీసులపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులు దీనికి కారణమయ్యాయి. సోమవారం సైతం ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు 8 శాతం మేర పడిపోయి రూ.90.37 వద్ద ట్రేడవుతున్నాయి. తాజా పతనానికి కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్, ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సోషల్‌మీడియాలో నడిచిన వివాదమే కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కమెడియన్ కునాల్ కమ్రా ఓలా ఎలక్ట్రిక్ సర్వీసుల గురించి ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో వీరి మధ్య వివాదం రేకెత్తింది. ఓలా ఎలక్ట్రిక్‌కు తగినన్ని సర్వీస్ సెంటర్స్ లేవని, దీంతో కస్టమర్లు విసుగు చెందుతున్నారని పేర్కొంటూ మొదట కునాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన భవీశ్ అగర్వాల్ "నీ కామెడీ కెరీర్ పూర్తవడంతోనే ఇలాంటి పెయిడ్ పోస్టులు పెడుతున్నావు" అంటూ విరుచుకుపడ్డారు. తన సర్వీసు ఓలా సర్వీసు స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తే కామెడీ షోల కంటే ఎక్కువ మొత్తం ఇస్తానంటూ పేర్కొన్నారు. దీనికి ప్రతిగా కునాల్ సైతం "అసంతృప్తితో ఉన్న కస్టమర్లకు పూర్తి రిఫండ్ ఇవ్వగలరా?" అంటూ సవాల్ విసిరారు.