Ola Electric: ఇండియాలో అతిపెద్ద టూ-వీలర్ ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక ప్రకటన చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి సేవలను అందించడంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో కస్టమర్ల నుంచి తీవ్ర విమర్శనలను ఎదుర్కొంటున్న వేళ రాబోయే రెండేళ్లలో టూ-వీలర్, త్రీ-వీలర్ విభాగంలో అధిక సంఖ్యలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ కంపెనీకి చెందిన స్కూటర్లలో బ్యాటరీ ప్రాబ్లమ్స్, సడన్‌గా ఆఫ్ అయిపోవడం వంటి సమస్యల కారణంగా చాలామంది వినియోగదారులు ఓలా షోరూమ్స్ ముందు బారులు తీరిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవైపు కొత్త సర్వీస్ సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకుంటూనే మరోవైపు మరిన్ని కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకురావడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే రానున్న రెండేళ్లలో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో 20 కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్లు ఓలా తాజాగా ప్రకటించింది. ఇక నుంచి ప్రతి క్వార్టర్ పీరియడ్‌లో ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఓలా స్కూటర్లకు సంబంధించి వినియోగదారులకు సరైన సేవలు అందించట్లేదని ఇటీవలే స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా లేవనెత్తారు. దీంతో సోషల్ మీడియా వేదికగా కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్, కునాల్ కమ్రాకు మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే నడిచింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా పతనమయ్యాయి. ఈ వివాదం తర్వాత కంపెనీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తన షోరూంల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త ఈవీ ప్రొడక్టుల గురించి కూడా ఓలా ఈ ప్రకటన చేయడం గమనార్హం.