Worlds First Quantum Chip Majorana-1:క్వాంటమ్ కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ పెద్ద ముందడుగు వేసింది. ఈ మేరకు 'మయోరానా 1 (Majorana 1)' పేరుతో టోపోలాజికల్ కోర్‌పై నిర్మితమైన ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటం చిప్‌ను విడుదల చేసింది. దశాబ్దాలు పట్టే పారిశ్రామిక స్థాయి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం గల క్వాంటం కంప్యూటర్లకు ఈ చిప్ శక్తినిస్తుందని కంపెనీ తెలిపింది.
ఏంటీ 'మయోరానా 1'?: మయోరానా-1 అనేది మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ (క్యూపీయూ). పాకెట్ పరిమాణంలో ఉండే ఈ చిప్ అన్ని కంప్యూటర్ల కంటే శక్తివంతంగా ఉంటుంది. ఈ చిప్ శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు సహాయపడుతుంది. అరచేతిలో ఇమిడి పోయే దీన్ని 'గాడ్ చిప్'గా పేర్కొంటున్నారు. ఇది కంప్యూటింగ్ తీరుతెన్నులను సమూలంగా మార్చివేయనుందని నిపుణులు చెబుతున్నారు. పదార్థ శాస్త్రం, కృత్రిమ మేధ, కొత్త ఔషధాల ఆవిష్కరణ తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఇది బాటలు పరుస్తుందని పేర్కొంటున్నారు.
టోపోలాజికల్ కోర్‌పై నిర్మితమైన తొలి క్యూపీయూ ఇదే!: ఈ చిప్ కొత్త 'టోపోలాజికల్ కోర్' ఆర్కిటెక్చర్‌పై నడుస్తుంది. పదార్థానికి సంబంధించి కొత్తగా కనుగొన్న ఒక దశ సాయంతో ఈ చిప్ పనిచేస్తుంది. దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈవో మాట్లాడారు. పదార్థాలు ఘన, ద్రవ, వాయు అనే మూడు దశల్లో మాత్రమే ఉంటాయని మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం కదా అయితే నేడు ఆ భావన మారిందని అన్నారు. టోపోకండక్టర్స్ అనే కొత్త రకం పదార్థం వల్ల ఈ ఆవిష్కారం సాధ్యమైందని తెలిపారు. రెండు దశాబ్దాల పరిశోధనతో ఈ పదార్థాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇది మరింత వేగవంతమైన, విశ్వసనీయమైన, చాలా చిన్నగా ఉండే క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధికి వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు.
ఏంటీ టోపోలాజికల్ కోర్?: క్వాంటమ్ కంప్యూటింగ్ గరిష్ఠ స్థాయిని అందుకోవాలంటే ఆ చిప్‌లలో కనీసం 10లక్షల (మిలియన్) క్యూబిట్లను అమర్చాల్సి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఇక టోపోకండక్టర్లతో తయారైన క్యూబిట్లు అయితే చాలా వేగంగా, విశ్వసనీయంగా పనిచేస్తాయి. వాటి పరిమాణం కూడా చిన్నగా ఉంటుంది. అది మిల్లీమీటరులో వందోవంతు మాత్రమే ఉంటుంది.
ఈ దిశగా 'మయోరానా 1' చిప్ అనేది ఒక ముందడుగు అని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. దీన్నిబట్టి మిలియన్-క్యూబిట్ ప్రాసెసర్ రూపకల్పన దిశగా స్పష్టమైన ముందడుగు పడినట్టే అని సత్య నాదెళ్ల తెలిపారు. ఇది గానీ ఆచరణలోకి వస్తే ప్రపంచంలో ప్రస్తుతమున్న కంప్యూటర్లన్నింటి ఉమ్మడి శక్తిని మించిన సామర్థ్యం కలిగి ప్రాసెసర్ సిద్ధమవుతుంది. ఇంతటి కంప్యూటింగ్ శక్తి వల్ల పదార్థ శాస్త్రం, కృత్రిమ మేధ, కొత్త ఔషధాల ఆవిష్కరణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.