Mercedes Benz AMG G63:దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది. ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ ఇండియన్ కస్టమర్ల కోసం AMG G63ని లాంచ్ చేసింది. దీని పాత వెర్షన్‌ను అప్డేట్ చేసి అదిరే ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త కారు 31 ప్రత్యేకమైన అప్హోల్స్టరీ ఆప్షన్స్, 29 పెయింట్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ లగ్జరీ కారు లాంచ్‌కు ముందే 120కి పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. 2025 మూడో క్వార్టర్లో కంపెనీ మంగళవారం నుంచి ఈ కారు బుకింగ్స్‌ను ప్రారంభించింది. మరెందుకు ఆలస్యం ఈ లగ్జరీ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.
ఆటోమేటిక్ గేర్‌బాక్స్: 2025 మెర్సిడెస్ బెంజ్ AMG G63 అదే బై-టర్బో 4.0L V8 ఇంజిన్‌తో 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తోంది. ఇది 590 బిహెచ్‌పి పవర్, 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్, 20 హార్స్‌పవర్ అడిషనల్ బూస్ట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. ఇది AMG 4MATIC సెటప్ ద్వారా అన్ని చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఈ SUVలో ఆఫ్-రోడ్ కోసం లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉంది.
పెర్ఫార్మెన్స్:ఈ కొత్త AMG G 63 కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. ఈ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు రేస్ స్టార్ట్ ఫంక్షన్‌తో వస్తోంది.
ట్విన్-స్క్రీన్ సెటప్: ఈ కారు ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులూ చేయకుండా కొన్ని చిన్న ట్వీక్స్తో తీసుకొచ్చారు. ఆఫ్-రోడ్ కాక్‌పిట్, సెంట్రల్ మల్టీమీడియా డిస్‌ప్లేను కొద్దిగా మార్చారు. వీటిలో వెహికల్ పొజిషన్, కంపాస్, ఆల్టిట్యూడ్, స్టీరింగ్ యాంగిల్, టైర్ ప్రెజర్, టెంప్రేచర్, డిఫెరెంటియల్ లాక్ స్టాటస్లు ఉన్నాయి. ఇక మిగిలిన డివైజస్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన ట్విన్-స్క్రీన్ సెటప్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు మెర్సిడెస్ లేటెస్ట్ MBUX సిస్టమ్‌ను కలిగి ఉంది.