Google Gemini Update :గూగుల్ కంపెనీ 'జెమిని' ఏఐ టూల్ యూజర్లకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి లేదా సమాచారం తెలుసుకోవడానికి, యూజర్లు తమ వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయవద్దని సూచించింది. లేదంటే యూజర్ల ప్రైవసీ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
'ఆ వివరాలు కొంతకాలం గూగుల్ డేటాలో ఉంటాయి'
'జెమిని వెబ్సైట్ లేదా యాప్ గూగుల్ అసిస్టెంట్‌కు అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఈ ఏఐ టూల్ ద్వారా మీరు ఏదైనా సమాచారం తెలుసుకున్న అనంతరం హిస్టరీని డిలీట్ చేసినా, రివ్యూ కోసం అవి కొంతకాలం పాటు గూగుల్ డేటాలోనే ఉంటాయి. లాంగ్వేజ్, డివైజ్, లొకేషన్, ఫీడ్‌బ్యాక్ కోసం రివ్యూ చేస్తారు. వీటికి గూగుల్ అకౌంట్లతో ఎలాంటి సంబంధం ఉండదు. యూజర్ తన డివైజ్‌లో 'జెమిని' యాక్టివిటీని డిసేబుల్ చేసినప్పటికీ, అప్పటి వరకు సెర్చ్ చేసిన వాటి వివరాలు 72 గంటలపాటు స్టోర్ అవుతాయి. కొన్నిసార్లు ఈ సమాచారం మూడేళ్లపాటు గూగుల్ స్టోరేజ్‌లో ఉంటుంది' అని గూగుల్ జెమిని యాప్ ప్రైవసీ బ్లాగ్‌లో వెల్లడించింది.
యూజర్ ప్రమేయం లేకుండానే ఆన్ అయ్యే ఛాన్స్
కొన్నిసందర్భాల్లో యూజర్ ప్రమేయం లేకుండానే జెమిని సర్వీస్ ప్రారంభమవుతుందని గూగుల్ తెలిపింది. ఉదాహరణ 'Hey Google' కమాండ్‌ను పోలిన సౌండ్ వినిపించినా జెమిని యాక్టివేట్ అవుతుందని గూగుల్ జెమినీ యాప్ బ్లాగ్‌లో వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో జెమిని అడ్వాన్సిడ్ వెర్షన్ 1.0ను మూడు వేరియంట్లలో గూగుల్ తీసుకొచ్చింది. జెమిని అల్ట్రా, జెమిని ప్రో, జెమిని నానో. ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్ డివైజ్‌ల వరకు అన్నింటిలోనూ పనిచేస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.