Digi Yatra Airports in India: విమానాల్లో విదేశాలకు వెళ్లే వారికి సైతం ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ)ని వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతంలో కేవలం దేశీయ మార్గాల్లో ప్రయాణం కోసం మాత్రమే ఈ సేవలు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం విదేశీ ప్రయాణాలకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జూన్‌లో దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ ఆరంభించనుందని డిజియాత్ర సీఈఓ కె.సురేశ్ తెలిపారు. "అంతర్జాతీయ ప్రయాణానికి ఎఫ్‌ఆర్‌టీ వినియోగించాలంటే, ఇక్కడి నుంచి విమానం గమ్యం చేరే దేశం కూడా అంగీకరించాలి. అందుకే 2025 జూన్‌లో రెండు దేశాల మధ్య ప్రయాణానికి ఈ సదుపాయాన్ని వినియోగించాలన్నది తమ ప్రణాళికగా" సురేశ్ తెలిపినట్లు హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది.
ఎఫ్‌ఆర్‌టీతో డిజియాత్ర సేవలు:
- దేశీయ మార్గాల్లో ఎఫ్‌ఆర్‌టీని వినియోగించుకునేందుకు డిజియాత్ర యాప్‌ను అభివృద్ధి చేశారు.
- ఆధార్ ఆధారంగా ఇందులో పెద్దవారితో పాటు మైనర్ల వివరాలను కూడా నిక్షిప్తం చేయొచ్చు.
- ఇందుకోసం ప్రతి ఒక్కరి ముఖాన్ని సెల్ఫీ ద్వారా చిత్రీకరించాలి. తదుపరి ప్రయాణానికి ముందు బోర్డింగ్ పాస్ వివరాలను సంబంధిత ఫీచర్‌లో జత చేస్తే సరిపోతుంది.
అత్యంత వేగంగా విమానాశ్రయంలోకి ప్రవేశం:
- హైదరాబాద్, విశాఖపట్నం, దిల్లీ, బెంగళూరు, వారణాసి, కోల్‌కతా, ముంబయి, పుణె, కోచి.. తదితర ఎయిర్‌పోర్ట్స్‌లో డిజియాత్ర కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను కేటాయించారు.
- అక్కడ ఉండే స్కానర్ వద్ద మొబైల్‌లోని డిజియాత్ర యాప్‌లో ఉన్న బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేసి, అక్కడే ఉన్న కెమెరా ఎదుట మన ఫేస్ ఉంచితే సెకన్ల వ్యవధిలోనే అనుమతి వచ్చి గేట్లు ఆటోమేటిక్‌గా తెరచుకుంటాయి.
- ఎవరూ కూడా డాక్యుమెంట్లను ఫిజికల్‌గా తనిఖీ చేసే పరిస్థితి ఉండదు. దీంతో అత్యంత వేగంగా విమానాశ్రయంలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం దేశీయ గమ్యస్థానాలకే ఈ సదుపాయాన్ని అనుమతిస్తున్నారు.