Zomato CEO Deepinder Goyal:విధుల్లో ఉండగా తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న పరిస్థితులు తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. ఆ సమయంలో ఓ మాల్‌లో ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దాని గురించి చెప్తూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీపిందర్ గోయల్ తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వర్తించారు. అయితే ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకోవడానికి ఓ మాల్‌లోకి వెళ్లగా.. లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కమని అక్కడి సెక్యూరిటీ స్టాఫ్ సూచించారని తెలిపారు.
"డెలివరీ పార్టనర్‌గా డ్యూటీ చేస్తున్న సమయంలో నాకొక విషయం అర్థమైంది. మేం గురుగ్రామ్‌లోని ఒక మాల్‌లో హల్దీరామ్స్ నుంచి ఆర్డర్కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లాం. వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్లాలని నాకు సూచించారు. అక్కడ ఎలాంటి ఎలివేటర్లు లేవు. అదే విషయాన్ని నిర్ధరించుకోవడానికి మరోసారి మెయిన్ గేట్ వద్దకు వెళ్లాను. లిఫ్ట్‌కు అనుమతి లేదని తెలిసి.. మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లాను. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మెట్లద్వారం దగ్గరే ఎదురుచూడాల్సిన పరిస్థితి. పని సమయంలో డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని గ్రహించాను. మాల్స్ కూడా వారిపై మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి" అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తర్వాత ఇతర ఏజెంట్స్‌తో కాసేపు ముచ్చటించారని, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారని ఆయన తెలిపారు.