ISROs 100th Mission:ఎన్నో మైలురాళ్లను సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో చారిత్రక ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉంది. శ్రీహరికోట వేదికగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ మిషన్‌లో భాగంగా GSLV (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్)-F15 పేరుతో రాకెట్‌ను ప్రయోగించేందుకు రెడీగా ఉంది. ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో మంగళవారం ఈ మిషన్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసింది.
ఈ మిషన్‌లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు GSLV రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ జనవరి 29, 2025న ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులైన తర్వాత జరుగుతున్న తొలి ప్రయోగం కూడా ఇదే.
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) తన 17వ ప్రయోగంలో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ NVS-2 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. 2,250 కిలోల ఈ NVS-02 ఉపగ్రహాన్ని UR శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఇది L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్‌ను కలిగి ఉంది. అంతేకాక ఇది NVS-01 మాదిరిగా అదనపు C-బ్యాండ్‌లో కూడా పేలోడ్‌ను కలిగి ఉంది.
ఈ ప్రయోగం ఎందుకంటే?:శ్రీహరికోట వేదికగా ఇస్రో చేపట్టిన ఈ 100వ మిషన్ మన దేశ నావిగేషనల్ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ శాటిలైట్ భూమి, వైమానిక, సముద్ర.. నావిగేషన్, మొబైల్ డివైజెస్‌లో లొకేషన్-బేస్డ్ సర్వీసులు, ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (IoT) బేస్డ్ అప్లికేషన్స్, ఎమర్జెన్సీ అండ్ టైమ్ సర్వీసులను అందించేందుకు ఉపయోగపడుతుంది.