BSNL 5G Services: జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా 5G సేవలు తీసుకొచ్చేందుకు BSNL రెడీ అయింది. ఈ మేరకు తన 5G సేవలు వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తమ 5G సేవలను అందిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ కంపెనీలు టారీఫ్ ధరలు పెంచేశాయి. దీంతో తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్స్ ఏ నెట్‌వర్క్ ఇస్తుందోనని వినియోగదారులు చూస్తున్నారు.
వీరందరికీ BSNL ఓ ప్రత్యామ్నాయంగా మారింది. అయితే BSNLలో ఇప్పటికీ 5జీ నెట్‌వర్క్ లేకపోవడంతో యూజర్స్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో BSNL కూడా తన 5G నెట్‌వర్క్‌ను తీసుకురావడంపై ఫోకస్ చేసింది. త్వరలోనే కంపెనీ తన 5G సర్వీస్ ప్రారంభానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా ప్రకటించింది.
దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. భారత్‌లో BSNL 5G సేవలు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన కన్ఫార్మ్ చేశారు. ఇందుకోసం BSNL.. 3.6 GHz, 700 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై తన 5G రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN), కోర్ నెట్‌వర్క్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు.
5G సేవలను ఎప్పుడు ప్రారంభించొచ్చు?:
ది హిందూ నివేదిక ప్రకారం..వచ్చే ఏడాది మకర సంక్రాంతి నాటికి BSNL తన 5G సేవలను ప్రారంభించొచ్చు. దీనిపై BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (PGM-కృష్ణా జిల్లా) ఎల్. శ్రీను శనివారం మాట్లాడుతూ.. 4జీ సేవలను తదుపరి స్థాయికి అప్‌గ్రేడ్ చేసి నాణ్యమైన సేవలను అందించేందుకు BSNL ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీనిలో భాగంగా టవర్లు, ఇతర పరికరాలను కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.