Aprilia Tuono 457 Launch Timeline: ఇటాలియన్ బైక్ తయారీ సంస్థ ఏప్రిలియా తన కొత్త 'ఏప్రిలియా టువోనో 457' బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఈ మోటార్‌సైకిల్‌ను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీన దీని ధరలను ప్రకటిస్తామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను EICMA 2024లో ప్రదర్శించింది. 'ఏప్రిలియా టువోనో 457' అనేది 'RS 457' నేకెడ్ వెర్షన్. ఇది 'RS 457' మాదిరిగానే ఇంజిన్ అండ్ మెకానికల్ భాగాలను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను 'RS 457' కంటే కాస్త తక్కువ ధరలోనే లాంఛ్ చేయొచ్చు.
మన భారత మార్కెట్లో 'RS 457' మోడల్ బైక్ రూ. 4.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో సేల్ అవుతోంది. ఇక ఈ కొత్త బైక్ డిజైన్ విషయానికొస్తే.. అప్పీయరెన్స్ పరంగా 'టువోనో 457' సింగిల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో రానుంది. దీనికి ఇరువైపులా బూమరాంగ్-స్టైల్ డేటైమ్ రన్నింగ్ లాంప్స్ (DRL) ఇన్‌స్టాల్ అయి ఉంటాయి.
ఏప్రిలియా టువోనో 457 డిజైన్:ఈ మోటార్ సైకిల్ హెడ్‌ల్యాంప్ కింద వింగ్లెట్స్ను కూడా కలిగి ఉంది. ఇది కాకుండా మోటార్‌సైకిల్ కాస్మెటికల్గా RS 457ను పోలి ఉంటుంది. అయితే ఇందులోని వన్-పీస్ హ్యాండిల్ బార్, రియర్ సెట్ ఫుట్‌పెగ్స్, ఆర్చ్డ్ సీటుతో ఈ బైక్ రైడింగ్ వైఖరి 'RS 457' కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ మూడు రైడింగ్ మోడ్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాక ఇందులో 'RS 457' మాదిరిగా ట్రాక్షన్ కంట్రోల్, ABS వంటి ఇతర రైడర్ అసిస్ట్‌లు కూడా ఉంటాయి.