Richest Party In The World BJP : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ - దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా నిలిచిందని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. 2024 మార్చి 31 నాటికి బీజేపీ వద్ద రూ.7,113.80 కోట్లు, కాంగ్రెస్ వద్ద రూ.857 కోట్లు ఉన్నాయని ఈసీ విడుదల చేసిన డేటా ద్వారా తెలుస్తోంది.
అంత డబ్బు ఎలా వచ్చిందంటే?
2023-24 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రూ.1,754.06 కోట్లు ఖర్చు చేసిందని ఈసీ డేటా తెలిపింది. 2022-23లో చేసిన ఖర్చు రూ.1,092 కోట్లు కంటే ఇది 60 శాతం ఎక్కువని తెలిపింది. ఇక కాంగ్రెస్ 2022-23లో రూ.192.56 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో రూ. 619.67 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల కమిషన్‌కు అందించిన పార్టీల వార్షిక గణాంకాల ప్రకారం, బీజేపీకి 2023-24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,685.69 కోట్లు మేర విరాళాలు వచ్చాయి. అంతకు ముందు సంవత్సరంలో కాషాయ పార్టీకి రూ.1294.15 కోట్లు వచ్చాయి. 2022-23లో రూ.648.42 కోట్లు రాగా, గతేడాదిలో రూ.2,042.75 కోట్ల మేర విరాళాలు అందుకున్నట్లు బీజేపీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 2023-24లో విరాళాల ద్వారా వచ్చిన రూ.1129.67 కోట్లతో కలిపి మొత్తం రూ.1225.11 కోట్లు వచ్చినట్లు ఈసీకి ఇచ్చిన ఆడిట్ నివేదికలో పేర్కొంది. 2024 మార్చి 31 నాటికి కాంగ్రెస్‌కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.828.36 కోట్లు వచ్చాయని తెలిపింది.
పార్టీల ఆదాయం - ఖర్చులు
ఒక సంవత్సర కాలంలోనే ప్రకటనల కోసం బీజేపీ రూ.591 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా కోసం రూ.434.84 కోట్లు, ప్రింటెడ్ మెటీరియల్ కోసం రూ.115.62 కోట్లు ఖర్చు చేశారు. అధికార పార్టీ 2023-24లో విమానం/హెలికాప్టర్ల కోసం రూ.174 కోట్లు ఖర్చు చేసింది. 2022-23లో రూ.78.23 కోట్లు ఖర్చు చేసింది. అభ్యర్థులకు రూ.191.06 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించింది. అంతకు ముందు ఏడాది రూ.75.05 కోట్లు ఇచ్చింది. 2024లో సమావేశాల కోసం బీజేపీ రూ.84.32 కోట్లు, 2023-24లో మోర్చాలు, ర్యాలీలు, ఆందోళనలు, కాల్ సెంటర్ల నిర్వహణకు రూ.75.14 కోట్లు ఖర్చు చేసింది.
మరోవైపు కాంగ్రెస్ 2023-24లో ఎలక్ట్రానిక్ మీడియాపై రూ.207.94 కోట్లు, ప్రింటెడ్ మెటీరియల్‌పై రూ.43.73 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో విమానాలు/హెలికాప్టర్ల కోసం రూ.62.65 కోట్లు ఖర్చు చేసింది. అభ్యర్థులకు రూ.238.55 కోట్ల ఆర్థిక సాయం అందించింది. మార్చి 31, 2024 నాటికి ప్రచార ఖర్చుల కోసం రూ.28.03 కోట్లు, సోషల్ మీడియా కోసం రూ.79.78 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర 2 కోసం రూ. 49.63 కోట్లు ఖర్చు చేశారని కాంగ్రెస్ తన ఆడిట్ రిపోర్ట్‌లో పేర్కొంది. 2022-23లో భారత్ జోడో యాత్రకు రూ.71.84 కోట్లు ఖర్చు చేశారని తెలిపింది.