New Chrome Features : గూగుల్ క్రోమ్ తమ యూజర్లకు మరింత మెరుగైన సెర్చ్ అనుభవాన్ని అందించడం కోసం 5 సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- గూగుల్ క్రోమ్‌లో ఇకపై రెస్టారెంట్లను చాలా సులువుగా, తక్కువ సమయంలో వెతకవచ్చు. అది ఎలా అంటే? ఉదాహరణకు, మీరు ఏదైనా రెస్టారెంట్ కోసం వెతుకుతుంటే, సెర్చ్ బార్ దగ్గర కొత్తగా 3 షార్ట్‌కట్ బటన్స్ కనిపిస్తాయి. వాటి సాయంతో ఆ రెస్టారెంట్ ఫోన్ నంబర్, రూట్ మ్యాప్, రివ్యూలను సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఐఫోన్ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి తీసుకురానున్నారు.
- గూగుల్ కంపెనీ క్రోమ్ బ్రౌజర్లోని అడ్రస్ బార్‌ను రీడిజైన్ చేసింది. ఇది ప్రధానంగా ట్యాబ్లెట్లో ఉండే క్రోమ్ బ్రౌజర్లో పని చేస్తుంది. వాస్తవానికి గూగుల్ మెటీరియల్ యూ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా దీనిని రీడిజైన్ చేసింది. దీని వల్ల మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు, సెర్చ్ బార్ కిందనే డ్రాప్‌డౌన్ కనిపిస్తుంది. అందులో మీరు ఇటీవల చూసిన వెబ్‌సైట్లు, మీరు వెతుకుతున్న విషయానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి.
- ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న 'ట్రెండింగ్ సెర్చెస్' ఫీచర్, ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఇకపై యాపిల్ యూజర్లు కూడా సెర్చ్ బార్‌పై క్లిక్ చేస్తే, ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు అన్నీ కనిపిస్తాయి.
- గూగుల్ క్రోమ్‌లోని డిస్కవర్ ఫీడ్‌లో కొత్తగా లైవ్ స్పోర్ట్స్ కార్డ్‌లు కూడా కనిపించనున్నాయి. మీరు గతంలో వెతికిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు కూడా ఇందులో కనిపిస్తాయి. ఓవర్ ఫ్లో మెనూ (మూడు చుక్కల మెనూ)ను ఉపయోగించి డిస్కవర్ ఫీచర్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు.
- ఇకపై బస్సు, ట్రైన్ వేళలను క్రోమ్ సెర్చ్‌లోనే తెలుసుకోవచ్చు. సెర్చ్ బార్‌లో 'షెడ్యూల్' అని టైప్ చేయగానే మీరున్న ప్రాంతానికి చెందిన రవాణా సర్వీసుల షెడ్యూల్ వివరాలు వెబ్‌సైట్ సజెషన్స్‌లో కనిపిస్తాయి.
గమనిక : ప్రస్తుతానికి ఈ గూగుల్ క్రోమ్ ఫీచర్లు కొన్ని ప్రాంతాల వారికి, కొందరు యూజర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే అందరు యూజర్లకు గూగుల్ పూర్తిస్థాయిలో ఈ సదుపాయాలను అందించే అవకాశం ఉంది.