Transgender Love Marriage in Jagtial : వారిద్దరూ రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుని, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు. ఇందులో ఆశ్చర్యం ఏం ఉందని అనుకుంటున్నారా? ఈ ప్రేమ కహానీ ఓ ట్రాన్స్‌జెండర్, యువకుడిది కావడమే ఇక్కడ స్పెషల్. ఆఁ.. ఏముందిలే ఈ మధ్యకాలంలో ఇలాంటి పెళ్లిళ్లు సోషల్ మీడియాలో చాలానే చూస్తున్నాం అని కొట్టిపడేయకండి! యువకుడు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వారందరి సమక్షంలో ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నాడు. సాధారణంగా ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి అంటే ఏ కుటుంబ సభ్యులైనా ఒప్పుకోరు. కానీ ఈ అబ్బాయి కుటుంబసభ్యులు మాత్రం కుమారుడి ఇష్టాన్ని గౌరవించి, అతడి మనసుకు నచ్చిన వ్యక్తి(ట్రాన్స్‌జెండర్)ని ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. ఈ పెళ్లికి జగిత్యాల జిల్లా వేడుకైంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస మల్యాల, అదే మండలానికి చెందిన మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ కరుణాంజలిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి వివాహం వరకు దారి తీసింది. అయితే ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయిన శ్రీనివాస్, అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారం చెప్పాడు.