Under Construction Bridge Girder Collapses in Manair Vagu : ఈదురుగాలులకు మానేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన సిమెంట్ గడ్డర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో జరిగింది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లు అయింది. ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు కూడా కాస్త ఊపిరి తీసుకున్నారు. అయితే కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వంతెనను జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం గర్మళ్లపల్లి-పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్యలో మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మిస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : సోమవారం అర్ధరాత్రి వీచిన గాలి దుమారానికి మానేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన సిమెంట్ గడ్డర్స్ కూలిపోయాయి. పెద్దపల్లి జిల్లా మానేరు వాగుపై దాదాపు రూ.46 కోట్లతో 2016లో వంతెన నిర్మాణానికి అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 2023-24 లో మరోక రూ.11 కోట్ల నిధులను ఈ వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు. ఇది పూర్తి అయితే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా మెరుగుపడుతుంది.
Karimnagar Cable Bridge Cracks : కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించి నెల కాకముందే పగుళ్లు