Side Effects of Sleeping in Jeans: మనలో కొంతమంది జీన్స్‌లోనే సౌకర్యంగా ఫీలవుతారు. అయితే, ఎంత నచ్చినా సరే.. ఇంటికొచ్చిన తర్వాత మాత్రం ఈ దుస్తులు మార్చుకొని వదులుగా ఉండే నైట్‌వేర్ ధరించినప్పుడే హాయిగా ఉంటారు. కానీ ఒక్కోసారి అనుకోకుండా స్నేహితుల ఇంటికి వెళ్లినా.. లేదంటే ప్రయాణాల్లో ఉన్నా.. కొన్నిసార్లు అదే జీన్స్‌లో నిద్రపోవాల్సి వస్తుంది. ఇలా పడుకోవడం వల్ల అసౌకర్యమే కాకుండా.. ఆరోగ్యపరంగానూ కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు.
అందుకే ఫంగల్ ఇన్ఫెక్షన్లు!
డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో తయారయ్యే జీన్స్‌కు.. త్వరగా చెమటను పీల్చుకునే స్వభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా జననేంద్రియాల వద్ద చెమట అలాగే ఉండిపోతుందని అంటున్నారు. ఈ తేమతోనే గంటల తరబడి ఉండిపోవడం వల్ల.. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. అలాగే బిగుతైన దుస్తుల వల్ల ఆయా శరీర భాగాలకు సరిగ్గా గాలి తగలక.. అక్కడి చర్మంపై దురద, దద్దుర్లు, ఎరుపెక్కడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. 2017లో Contact Dermatitis జర్నల్‌లో ప్రచురితమైన "Denim-induced allergic contact dermatitis: A case series" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ సమయం జీన్స్ ధరించేలా చూసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా సీజన్‌తో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా పట్టేవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నిద్రకు అంతరాయం!
సాధారణంగానే మనం నిద్రలోకి జారుకున్న కొన్ని గంటలకు శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే జీన్స్ ధరించి పడుకున్నప్పుడు మాత్రం శరీరానికి గాలి తగలక.. ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందని చెబుతున్నారు. తద్వారా నిద్రకు అంతరాయం ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా.. జీన్స్ వంటి టైట్ దుస్తులు ధరించి పడుకోవడం వల్ల అసౌకర్యంగానూ అనిపిస్తుంటుందని వివరిస్తున్నారు. ఇది కూడా సుఖనిద్రను దూరం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
నెలసరి నొప్పి తీవ్రంగా!
ముఖ్యంగా మహిళలు జీన్స్ వంటి బిగుతైన దుస్తులు ధరించి నిద్ర పోవడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియాలపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. అలాగే ఆయా భాగాలకు రక్తప్రసరణ కూడా సాఫీగా జరగదని అంటున్నారు. ఫలితంగా నెలసరి సమయంలో నొప్పి మరింత తీవ్రం అవుతుందని వివరిస్తున్నారు. మరోవైపు ఇలాంటి బిగుతైన దుస్తుల వల్ల నడుము నొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలూ ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పడుకునేటప్పుడైనా, ఇతర సమయాల్లో అయినా సాధ్యమైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులకు ప్రాధాన్యమివ్వడం మంచిదని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కింద కూర్చుని పైకి లేవలేకపోతున్నారా? ఈ సింపుల్ టెస్టులతో క్షణాల్లో మీరెంత బలవంతులో తెలుస్తుందట!
మీ గుండె తక్కువగా కొట్టుకుంటుందా? హార్ట్ స్పీడ్ తగ్గితే ఏం చేయాలో తెలుసా?