Collector Lunch With Students : యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఎమ్. హనుమంత రావు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం అక్కడి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. వంట చేసిన వారితో మాట్లాడుతూ భోజనం రుచికరంగా ఉందని ప్రశంసించారు. విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీ సభ్యురాలు కవితను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ఇలాగే విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ఆమెను కోరారు.
జిల్లాకు మంచి పేరు : పదో తరగతిలో 10/10 వచ్చిన విద్యార్థులకు సైకిల్ బహుమతిగా అందజేస్తానని కలెక్టర్ హనుమంత రావు విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ కష్టపడి చదువుకుని యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ తదితర ఖర్చులన్నింటినీ 40 శాతం మేర పెంచింది.
గురకుల బాట కార్యక్రమం : ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు గురుకుల బాట అనే కార్యక్రమం పెట్టి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్లు సైతం పాఠశాలలో పిల్లలకు అందించే భోజనం పట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాణ్యతను పెంచే విధంగా చూస్తున్నారు. ఈ మధ్యే కలెక్టర్ హనుమంత రావు భువనగిరి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్‌కు తనిఖీ కోసం వెళ్లి చూడగా అక్కడ భోజనం సరిగా లేకపోవడంతో అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హనుమంత రావు ప్రభుత్వ పాఠశాలలపై తీసుకుంటున్న శ్రద్ధ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజెన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పెరుగు మజ్జిగైంది, గుడ్డు సైజ్ మారింది - తనిఖీకి వచ్చిన కలెక్టర్ రియాక్షన్ చూడండి
'మా నాన్న భూ వివాదం పరిష్కరించండి'- కలెక్టర్‌కు ఇద్దరు చిన్నారుల విజ్ఞప్తి