Tirumala Instructions to Pilgrims :అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడక మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుపతి, తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో ఆ మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే యథావిధిగా కొండపైకి అనుమతిస్తున్నారు. ఆ సమయం పూర్తైన తర్వాత భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. ఒక్కో గుంపులో 70 నుంచి 100 మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అలాగే 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటలు దాటిన తర్వాత అలిపిరి నడక మార్గాన్ని టీటీడీ అధికారులు మూసివేస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గం, కొండపై పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.
గత కొన్నేళ్లుగా ఏపీలోని చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో చిరుతల సంచారం పెరిగింది. శేషాచలం అడవుల్లో ఉండే చిరుతలు తిరుమల కొండపై ప్రత్యక్షం అవుతూ, టీటీడీ సిబ్బందిని, భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఎక్కువగా సంచరిస్తూ, జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు భక్తులకు కంటపడుతున్నాయి. 2023లో ఓ చిన్నారిని చిరుత చంపేసింది. పలువురిని గాయపరిచాయి. దీంతో టీటీడీ అధికారులు భక్తులు ఎవరూ ఒంటరిగా నడక మార్గాల్లోనూ, కొండపైన సంచరించవద్దని పలు సూచనలు చేశారు. గుంపులుగా వెళుతూ, తమ వెంట చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.
ఈ నెలలో రెండుసార్లు కనిపించాయి :తిరుమలలో చిరుత కదలికలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. ఈ నెలలోనే రెండుసార్లు చిరుత కనిపించింది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత ఉన్నట్లు భక్తులు గుర్తించి, టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అలాగే సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలో కూడా చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఎస్వీ వేద విశ్వవిద్యాలయం సమీపంలో కూడా చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించి, అప్రమత్తమయ్యారు.