Public Interest Litigation in Kothwalguda Aqua Marine Park : హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కొత్వాల్‌గూడ వద్ద హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆక్వా మెరైన్ పార్కుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపించారు.
రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణాలు : భారత దేశంలోనే అతిపెద్ద ఆక్వా మెరైన్ పార్కును కొత్వాల్‌గూడలో నిర్మిస్తున్నారని, హెచ్‌ఎండీఏ 2023 మే నెలలో టెండర్లు పిలిచిందని, రూ.300 కోట్ల బడ్జెట్‌తో పనులు కూడా ప్రారంభించారని న్యాయవాది శ్రీరమ్య తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. కృత్రిమ నీటిలో షార్క్ చేపలు, ఇతర అరుదైన జాతికి చెందిన సముద్రపు చేపలు బతికే అవకాశం తక్కువని ఆమె బలమైన వాదనలు వినిపించారు. సముద్ర జలాలు కలుషితం కావడం వల్ల ఇప్పటికే ఎన్నో అరుదైన సముద్రపు జీవులు అంతరించిపోతున్నాయని ఆమె కోర్టుకు తెలిపారు.
కౌంటరు దాఖలుకు మరికొంత సమయం కావాలి : ఆక్వా మెరైన్ పార్కు ఏర్పాటుకు ముందు సముద్ర జీవులు, అరుదైన పక్షుల సహజ అలవాట్లపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని శ్రీరమ్య కోర్టుకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్‌ఎండీఏ, రాష్ట్ర మత్యశాఖను ప్రతివాదులుగా పిటిషన్లో చేర్చారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ దీనిపై కౌంటర్ దాఖలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరారు. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు మరో 4 వారాలకు వాయిదా వేసింది.
4 ఎకరాల విస్తీర్ణంలో : భారతదేశంలోనే అతి పెద్దదిగా పేర్కొంటున్న ఆక్వా మెరైన్ పార్కు కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌లోనే 4.27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దీనిలో ప్రత్యేకంగా సొరంగం మార్గం 100 మీటర్ల వ్యాసంతో 3.5 మీటర్ల వెడల్పుతో నడిచేందుకు వీలుగా ఉండబోతుంది. సొరంగాన్ని 180 డిగ్రీలలో చూడవచ్చు. సొరంగంలో కనీసం 2,500 మంది ఒకేసారి వీక్షించేటట్లుగా దీని సామర్థ్యం ఉంటుంది. మొత్తం అక్వేరియంను నీటితో నింపాలంటే మూడు మిలియన్ లీటర్లు అవసరమవుతాయి. ఒక్క టన్నెల్ ట్యాంక్ సామర్థ్యమే రెండు మిలియన్ లీటర్లుగా ఉంది.
చూడ్డానికి రెండు కళ్లు చాలని కొత్వాల్‌గూడ ఎకో పార్క్ - వారెవ్వా! ఏంటి బ్రో ఆ సదుపాయాలు