తెలంగాణ

telangana

ETV Bharat / state

సినీ ప్రముఖులతో పరిచయాలు - ఆ ఫొటోలు చూపించి రూ.కోట్లలో మోసాలు

హోటల్స్, జువెలర్స్‌లో భాగస్వామ్యం కల్పిస్తానంటూ పలువురి నుంచి రూ.కోట్లలో వసూలు - నిందితుడు కాంతిదత్‌ అరెస్టు

Kanthi Dutt Arrest In Hyderabad
Tritiyaa Fine Jewellery founder Kanthi Dutt Arrest (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Tritiyaa Fine Jewellery founder Kanthi Dutt Arrest: పాతికేళ్ల వయసులోనే కోటీశ్వరుడు కావాలనుకున్నాడు. పదో తరగతి కూడా పాస్ కాలేదు. కానీ ఓ ఈవెంట్ నిర్వహించి సెలబ్రిటీలను రప్పించాడు. వారందరితో పరిచయాలు పెంచుకున్నాడు. వారి సహాయంతో రాజకీయ, సినీ ప్రముఖులను కలిసి వారితో ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలు చూపిస్తూ వారంతా తన వ్యాపారాల్లో భాగస్వాములని నమ్మించాడు. పలువురితో పెట్టుబడులు పెట్టించి రూ.కోట్లలో మోసం చేశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు.

జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం : ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన తొనంగి కాంతిదత్‌ (24) పదో తరగతి ఫెయిలయ్యాడు. కొంతకాలం తర్వాత ఈవెంట్స్‌ నిర్వహించే సంస్థను పెట్టాడు. విశాఖపట్నంలో పింక్‌థాన్‌ నిర్వహించాడు. ప్రముఖ డిజైనర్‌ శిల్పారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వేడుక పేరుతో శిరీషా రెడ్డి అనే స్థానిక మహిళ నుంచి రూ.60 లక్షలు వసూలు చేశాడు. 2018లో కుటుంబంతో హైదరాబాద్​కి మకాం మార్చాడు.

‘సస్టెయినబుల్‌ కార్ట్‌’ పేరుతో : పింక్‌థాన్‌తో ఏర్పడిన పరిచయాలతో శిల్పారెడ్డితో కలిసి ‘సస్టెయినబుల్‌ కార్ట్‌’ పేరుతో జూబ్లీహిల్స్‌లో పర్యావరణహిత ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమెతో దాదాపు రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. ఆపై అక్కడి ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో శిల్పారెడ్డి సంస్థలో నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కోకాపేటలో నివాసం ఏర్పరచుకున్న కాంతిదత్‌, నయోమి హోటల్స్‌ పేరుతో తొలుత జూబ్లీహిల్స్‌లో, తరువాత ఖాజాగూడ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో బ్రాంచీలు ప్రారంభించాడు. హోటల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రితో పాటు ఒక సినీ కుటుంబం భాగస్వామిగా ఉన్నట్లు నమ్మించి సౌమ్య, మరో మహిళ నుంచి రూ.1.40 కోట్ల పెట్టుబడులు సేకరించాడు. కొన్నాళ్లకు బంజారాహిల్స్, ఖాజాగూడలో హోటల్స్‌ ఎత్తేశాడు.

తృతీయ జువెల్లర్స్‌ పేరిట : ఆ తర్వాత తృతీయ జువెల్లర్స్‌ సంస్థను ఏర్పాటు చేశాడు. ఓ సినీ నటి ఇందులో భాగస్వామిగా ఉన్నట్టు ప్రచారం చేసుకుని హైదరాబాద్‌కు చెందిన శ్రీజారెడ్డి, ప్రవీణ్‌లను డైరెక్టర్లుగా చేర్చుకొని రూ.5.8 కోట్ల మేర మోసం చేశాడు. జువెల్లర్స్‌లో పెట్టుబడి పేరుతో తనను మోసగించాడంటూ ఫిబ్రవరిలో శ్రీజా రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం నిందితుడిని అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 82లో దాదాపు రూ.5.8 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నాడని, 2 బెంజి, ఆడి కార్లు కూడా ఉన్నాయని వెల్లడించారు.

కాంతిదత్‌కు పలువురు రాజకీయ నాయకులతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వాహకులు, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్యాంకాంక్‌కు చెందిన మరొకరితోనూ పెట్టుబడుల పేరుతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించామన్నారు. అతనిపై వైజాగ్, హైదరాబాద్‌ సీసీఎస్‌లోనూ కేసులున్నాయని చెప్పారు. ఈ ఏడాది జులైలో మాదాపూర్‌లో కారుతో, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి రాపిడో డ్రైవర్‌ రాజశేఖర్‌ మృతికి కారణమైన కేసులో కాంతిదత్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణాలో గతేడాది డిసెంబర్​లో ఫోర్జరీ కేసు నమోదు కాగా, ముందస్తు బెయిల్ తీసుకున్నాడని పోలీసుల విచారణలో తెేలింది.

ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం - ఏఈ ఇంట్లో రూ.150 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

నగల వ్యాపారికి ఘరానా మోసగాడు టోకరా - చెల్లని చెక్కులు ఇచ్చి ఆభరణాలతో పరార్​ - Man who cheated jeweller In HYD

ABOUT THE AUTHOR

...view details