Tiger Wandering In Nirmal District :నిర్మల్ జిల్లా అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దపులి సంచారం కొన్ని రోజుల నుంచి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్‌లో ఆదివారం రాత్రి పెద్ద పులి రహదారి దాటుతుండగా అటువైపు వెళ్తున్న వాహనదారులు వీడియో తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు రాత్రి నుంచి వాహనదారులు మహబూబ్ ఘాట్ మార్గం గుండా వెళ్లకుండా ఇరువైపులా రోడ్లు మూసివేశారు. పులి ఇక్కడి నుంచి వెళ్లిందని ఊపిరి పీల్చుకున్న తరుణంలో మళ్లీ ఆదివారం రాత్రి సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్‌లో కనబడింది. పులి సంచరిస్తున్నట్లు కొంతమంది ప్రత్యక్షంగా చూసి వీడియో తీయడంతో భయాందోళనలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని ఏదో ఒక చోట పెద్ద పులి కనిపిస్తూ ఉందనే వార్త ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది.
కొన్ని రోజుల క్రితం నిర్మల్ అటవీ ప్రాంత గ్రామాల్లో తిరుగుతున్న పులి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటే వీలుందని ఇక్కడి అధికారులు మహారాష్ట్ర ఎఫ్‌ఆర్వో, అధికారులకు పులి సంరక్షణ బాధ్యతలను అప్పగించేందుకు నివేదికలు రూపొందించారు. పులి ఇక్కడి నుంచి వెళ్లిందని ఊపిరి పీల్చుకున్న తరుణంలో గత శుక్రవారం మళ్లీ కుంటాల, హన్మాన్‌నగర్ తండా ప్రాంతాల్లో కనబడింది. పులి సంచారాన్ని కొంతమంది ప్రత్యక్షంగా చూడటంతో భయాందోళనలకు గురవుతున్నారు.
గతంలో ఉదయపు నడకకు వెళ్లిన విజయ్‌కి పులి కనబడింది. గ్రామానికి అతిదగ్గరగా ఉండటంతో పరుగున చేరుకుని గ్రామస్థులకు ఈ విషయాన్ని తెలిపారు. జక్కుల సతీష్ మొక్కజొన్న విత్తనం వేసి నీటితడులిచ్చారు. ఆ చిత్తడిలో, పక్కనే వరి పొలంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. అదే మార్గంలో హన్మాన్‌తండా మీదుగా ఉదయం 8 గంటల సమయంలో పెద్దపులి సంచరిస్తుంది. పులిని పంట పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు గమనించి కేకలు వేస్తూ చెట్టెక్కి కూర్చున్నారు. కొందరు తండాకు చేరుకుని ప్రజలకు తెలిపి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.