Afzal Gunj Fire Case Update : అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పోలీసులు కీలక దోపిడీ దొంగను గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్ బీదర్ దోపిడీతో పాటు నగరంలో కాల్పుల వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. బీదర్ దోపిడీ కంటే ముందు మనీశ్ ముఠా ఛత్తీస్‌గఢ్‌లోని ఏటీఎం సిబ్బందిని బెదిరించి రూ.70 లక్షలు దోచుకున్నట్లు వెల్లడి అయింది. మనీశ్ బృందం కోసం బిహార్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు.
ఇప్పటికే మనీశ్‌పై బిహార్ ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్లు సమాచారం. ఈ ముఠాపై ఆయా రాష్ట్రాల్లో దోపిడీ, హత్య కేసులు ఉన్నాయి. మొత్తం 10 బృందాలతో దోపిడీ దొంగల ముఠా కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరోవైపు అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన తర్వాత నిందితులు పారిపోయిన ఆటోను పోలీసులు గుర్తించారు. దొంగలు ఆటోలో సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వరకు వెళ్లినట్లు తేలింది. ఆ సమయంలో వారు ఆటోలో ఏమైనా మాట్లాడుకున్నారా అనే కోణంలో డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. త్వరలోనే దోపిడీ దొంగల ముఠాను పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే? : గురువారం నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో ఓ ముఠా కాల్పులు జరిపింది. కర్ణాటకలోని బీదర్‌లో దోపిడీకి పాల్పడి అక్కడ ఏటీఎంలో డబ్బులు దోచేసే క్రమంలో ఇద్దరిపై కాల్పులు జరిపి హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించి రాయపూర్ మీదుగా పారిపోవాలని ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అఫ్జల్‌గంజ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో రాయ్‌పూర్ పారిపోవడానికి వీరు తీవ్రంగా ప్రయత్నించారు.
ఈ క్రమంలో ట్రావెల్స్ యాజమాన్యం బ్యాగులు తనిఖీ చేయగా, కట్టల కొద్దీ డబ్బును చూసి అనుమానంతో ప్రశ్నించడంతో నిందితులు ట్రావెల్స్ సిబ్బందిలో ఒకరిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. బీదర్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన దోపిడీతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీరి కోసం 10 స్పెషల్ పోలీస్ టీమ్స్ తిరుగుతున్నాయి.
అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపింది అమిత్‌కుమార్ ముఠానే! - 10 బృందాలతో గాలింపు
అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ కలకలం - బీదర్ దొంగల ముఠా కాల్పులు - కర్ణాటక, తెలంగాణ పోలీసులకు సవాల్!