Accident at Srisailam Left Canal Tunnel : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్‌లు కిందపడటంతో పైకప్పు కూలి సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారు.
సొరంగంలో చిక్కుకున్న 8 మంది :దోమలపెంట సమీపంలోని SLBC టన్నెల్‌లో ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద... సొరంగంలో.. 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉదయం షిఫ్ట్ లో సొరంగంలో పనులకు 50 మంది లోపలికి వెళ్లారు. ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి కార్మికులు బయటకు వచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో... వారిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. కూలీలు పంజాబ్ , జమ్మూకశ్మీర్ , యూపీ వాసులుగా గుర్తించారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి.
సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం :SLBC టన్నెల్ ప్రమాదం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని.. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును... అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలానికి చేరుకుని... ఉత్తమ్ తో పాటు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. మరోవైపు ప్రమాద ఘటన గురించి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. లోపల ఉన్న వారిని రక్షించేందుకు పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.