AP Liquor Shops Tenders Update :ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్స్‌ల సందడి ముగిసింది. రాత్రి 7 గంటలకు సమయం ముగిసిందని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఆ సమయంలోగా క్యూలైన్లో ఉన్నవారి దరఖాస్తులు స్వీకరించారు. వారికి టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి మద్యం దుకాణాలకు పోటీ బాగా పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం లిక్కర్ పాలసీని సమగ్రంగా మార్చాలని నిర్ణయించడం, అన్ని రకాల బ్రాండ్లకు అవకాశం ఇవ్వడంతో చాలామంది బరిలో నిలిచారు. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు సుమారు 90వేల వరకు దరఖాస్తులు వచ్చాయని అంచనా. కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.1800 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.
అప్లికేషన్లు ఎక్కువ వచ్చిన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా ముందుంది. ఇక్కడ నోటిఫై చేసిన 113 మద్యం దుకాణాలకు 5,700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. విదేశాల నుంచి ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తులు దాఖలయ్యాయి.
'మద్య'వర్తుల రాయ'బేరం' : మరోవైపు అయిదేళ్ల తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీలో మద్యం షాపులు ఒకటి తగిలితే చాలు పరపతి పెంచుకోవచ్చనేది చాలా మంది ఆలోచన. ఆ అవకాశం దక్కించుకోవడానికి పొలిటికల్ లీడర్ల నుంచి దిగువస్థాయి దళారుల వరకు ప్రస్తుతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వ్యాపార కోరిక, రాజకీయ కాంక్షల మధ్య మధ్యవర్తులు రాయబారం నడుపుతున్నారు.