police Raids On Cockfight Den : కోడి పందేలు అనగానే గుర్తు వచ్చేది ఆంధ్రా. అక్కడ సంక్రాంతి పండక్కి కోట్ల రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. ఆ మూడు రోజులు పోలీసులు కూడా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని పట్టించుకోరు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పందేలు ఎక్కువగా అవుతాయి. ఇంకా మిగిలిన జిల్లాల్లో కూడా పందేలు జోరుగానే సాగుతాయి. ఇప్పుడెందుకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేల గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎలాంటి బెరుకు లేకుండా ఈ పోటీలను నిర్వహించారు.
పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించడంతో కోడి పందేల గుట్టురట్టు అయింది. పట్టుబడ్డ వారిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వివరాలు వెల్లడించేందుకు సంకోచించడం వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారి వద్ద రూ.30లక్షల నగదు, రూ.కోటి విలువ చేసే జూద క్రీడకు సంబంధించిన బెట్టింగ్ కాయిన్స్, కార్లు దొరికాయి.
ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు : ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన శివమారుతి హైదరాబాద్ నగరంలో ఉంటూ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని తోల్కట్ట పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కోడి పందేల నిర్వహణకు ప్రత్యేకంగా బరి ఏర్పాటు చేశారు. సుమారు 200మందికిపైగా వ్యక్తులతో కోడి పందేలను నిర్వహించారు. వారిలో కొందరు జూద క్రీడను కూడా ఆడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించగా 64 మంది పట్టుబడగా మిగతా వారు తప్పించుకున్నారు. 50 కార్లతో పాటు 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పందెం రాయుళ్లలో రాజకీయ ప్రముఖులు : వారందరినీ మొయినాబాద్ ఠాణాకు తరలించారు. పందెం రాయుళ్లలో చాలా మంది తప్పించుకున్నారు. కొంతమంది వాహనాలను అక్కడే వదిలేసి పరుగు తీశారు. జూదం, కోడి పందెంలలో పాల్గొన్న వారిలో కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారని తెలిసింది. అయితే ఇక్కడి స్థావరంపై దాడి చేసిన అనంతరం ఘటనా స్థలంలో ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రత్యక్షం కావడం విశేషం. భారీ ఎత్తున నగదు లభ్యం కావడంతో పోలీసులు లెక్కింపు యంత్రాలను తెప్పించారు. ఈ ఘటనపై మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ జి.పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.