Telangana Student Killed In Delhi IAS Coaching Center :సెంట్రల్ దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనలో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన తాన్యా సోని (25)అనే యువతి కూడా ఉంది. తాన్యా మృతితో ఆమె స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాన్య మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంతాపం తెలిపారు.
తాన్యా కుటుంబం ప్రస్తుతం తెలంగాణలోని మంచిర్యాలలో నివసిస్తోంది. ఆమె తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన విజయ్‌కుమార్ ఇద్దరు కుమార్తెలతో పాటుగా ఓ కుమారుడు ఉన్నారు. తాన్యా పెద్ద కుమార్తె. సివిల్స్ ప్రిలిమ్స్ కోచింగ్ కోసం ఆరు నెలల కిందట దిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లో చేరారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కురిసిన భారీవర్షానికి భవనంలోని సెల్లార్‌లో నిర్వహిస్తున్న రావూస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరదనీరు చొచ్చుకుపోవడంతో తాన్య వరద నీటిలో మునిగి మరణించింది.
దిల్లీ స్టడీ సెంటర్ ఘటనలో ఇద్దరు అరెస్ట్- కొన్నాళ్ల క్రితమే తెలిసినా పట్టించుకోని కౌన్సిలర్! - Delhi Coaching Centre Flooded
దిల్లీలోని ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తాన్యా సోని మృతిపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి : దిల్లీలో ముగ్గురు విద్యార్థుల మృతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాన్యా సోని తండ్రి విజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు కిషన్‌రెడ్డి తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మృతురాలి కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు దిల్లీలోని తన కార్యాలయం ద్వారా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
దిల్లీలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల విషాద మరణంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంతాపం తెలిపారు. తాన్య సహా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రధాన పట్టణాల్లో వరద నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
దిల్లీ సివిల్స్ స్టడీ సెంటర్ ఘటన ఎఫెక్ట్- 13కోచింగ్ సెంటర్లపై వేటు- నిందితులకు 14రోజులు జ్యుడీషియల్ రిమాండ్! - Delhi Coaching Centre Tragedy